విజయంపై వాదులాట | Sakshi
Sakshi News home page

విజయంపై వాదులాట

Published Sat, Jul 19 2014 12:21 AM

విజయంపై వాదులాట

* ముల్లైపెరియార్‌పై సభలో చర్చ
* విజయం మాదంటే మాదేనన్న పార్టీలు
* ఇది తమిళుల విజయం: జయలలిత
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముల్లైపెరియార్ విజయంపై శుక్రవారం అసెంబ్లీ అట్టుడికి పోయింది. ఈ విజయం తమదంటే తమదేనని అధికార, ప్రతిపక్ష పార్టీలు రచ్చకెక్కాయి. ముందుగా ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత వల్లే ముల్లైపెరియార్‌ను సాధించుకున్నామన్నారు. ఇది పూర్తిగా తమిళ ప్రజల విజయమని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయదారుల కల ఫలించిందని తెలిపారు. తేనీ, మదురై, శివగంగై, రామనాథపురం, దిండుగల్లు జిల్లాల్లోని వేలాదిమంది రైతులకు లబ్ధిచేకూరుతుందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

2002 వరకు చెన్నై హైకోర్టు పరిధిలో ఉన్న  వివాదం ముల్లైపెరియార్‌ ఆ తరువాత సుప్రీం కోర్టుకు చేరి ఎట్టకేలకు చారిత్రాత్మక న్యాయం చేకూరిందని అన్నారు. 142 అడుగుల ఎత్తు పెంపుపై మే 7వ తేదీన సుప్రీంకోర్టు తీర్పుచెప్పినా కేరళ ప్రభుత్వం అమలుకు నిరాకరించి నేడు భంగపడిందని అన్నారు. అనంతరం డీఎంకే సభ్యులు దురైమురుగన్ మాట్లాడుతూ ముల్లైపెరియార్‌పై వచ్చిన తీర్పు అందరికీ ఆనందకరమేనన్నారు. అయితే ఈ విజయం ఏ ఒక్కరి సొంతం కాదని అన్నారు. ఇందుకు అన్నాడీఎంకే సభ్యులు అభ్యంతరం తెలుపుతూ కేకలు వేశారు. డీఎంకే అధినేత కరుణానిధి, తమిళ ప్రజలు, ముఖ్యంగా ఐదు జిల్లాల రైతులు ఆందోళనలు నిర్వహించిన ఫలితమే నేటి విజయమని అన్నారు.

దురైమురుగన్ మాటలను అన్నాడీఎంకే నేతలు అడ్డుకోగా, స్పీకర్ సైతం వారినే సమర్థించడంతో నిరసనగా డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇంతలో డీఎండీకే సభ్యులు మోహన్‌రాజ్ మాట్లాడుతూ ముల్లైపెరియార్ సాధనలో తమ పార్టీ అధినేత కెప్టెన్ సాగించిన పోరాటం కూడా ఉందని అన్నారు. ఈ మాటలపై అన్నాడీఎంకే సభ్యులు పెద్దగా కేకలు వేస్తూ గట్టిగా నవ్వారు. దీన్ని అవమానంగా భావించిన డీఎం డీకే సభ్యులు అధికార పక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. వారిని శాంతిపజేసే ప్రయత్నంగా మంత్రి ఓ పన్నీర్ సెల్వం లేచినిలబడ్డారు. ముల్లైపెరియార్ కోసం కెప్టెన్ ఎలా పోరాడారని ఊహించుకుంటే తమ సభ్యులకు నవ్వువచ్చిం దని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు మరిం త అవమానకరమని పేర్కొంటూ డీఎండీకే సభ్యు లు వాకౌట్ చేశారు.
 
విచారణ అనంతరం చర్యలు : జయ
కొడంగయ్యూర్ పోలీస్ స్టేషన్‌లో విచారణ ఖైదీ గోపాల్ మరణించిన సంఘటనపై విచారణ పూర్తయిన తరువాత నిందితులపై చర్యతీసుకుంటామని అసెంబ్లీలో సీఎం జయ హామీ ఇచ్చారు. ఈనెల 15వ తేదీ గోపాల్‌ను పోలీసులు తీసుకువచ్చారు. 16వ తేదీ ఉదయం కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా పోలీస్‌స్టేషన్ వాకిట్లోనే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement