ఆ ఉద్యోగిని బిడ్డకు ప్రియుడే తండ్రి..! | Sakshi
Sakshi News home page

ఆ ఉద్యోగిని బిడ్డకు ప్రియుడే తండ్రి..!

Published Sun, Sep 1 2013 2:35 AM

DNA test confirms biological father of the child

బెంగళూరు, న్యూస్‌లైన్: ప్రియుడితో సహజీవనం చేస్తూనే మాజీ భర్తతో ఏకకాలంలో లైంగిక సంబంధం కొనసాగిస్తున్న మహిళ నెల తప్పితే... ఆ బిడ్డకు తండ్రికి ఎవరు? అనే సందిగ్ధం వేధించక మానదు. ఇటువంటి సంకట స్థితినే ఎదుర్కొన్న ఓ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగిని (40) నాలుగు నెలలుగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వాస్తవాన్ని తెలుసుకొని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రియుడే తండ్రని రుజువుకావడంతో, ఇకపై ఆయనతోనే కాపురం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరాదికి చెందిన ఆమె బెంగళూరులోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తోటి ఉద్యోగిని పదేళ్ల క్రితం పెళ్లాడినా వీరికి సంతానం కలగలేదు.
 
 దీంతో వారు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అదే కంపెనీలోని మరో సహోద్యోగితో ఆమె సహజీవనం సాగిస్తున్నారు. అయితే, ఆమె ఇప్పటికీ మాజీ భర్తతో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె 4 నెలల క్రితం గర్భం దాల్చారు. తల్లినవుతున్నందుకు ఆనందించాలో, పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తెలియక విచారించాలో తెలియక యాతన పడ్డారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారానే వాస్తవం నిగ్గుతేల్చుకోవాలని ఆమె నిర్ణయానికొచ్చారు. మాజీ భర్తను, ప్రియడిని వెంట పెట్టుకొని వారం క్రితం ఇక్కడి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించి డీఎన్‌ఏ పరీక్షలకు అభ్యర్థించారు. అరుదైన సందర్భం కావడంతో తొలుత సందేహించిన వైద్యులు, తర్వాత పరీక్షలకు అనుమతించారు. ఆ ముగ్గురి రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. ఉత్కంఠతో ఎదురు చూసిన నివేదిక శుక్రవారం వచ్చింది. తన బిడ్డకు కడుపులో బిడ్డకు ప్రియుడే తండ్రి అని రూఢికావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఆమెతో కాపురం చేయడానికి మాజీ భర్త, ప్రియుడు ఇద్దరూ ఆసక్తి చూపడం విశేషం. ఇక ప్రియుడితోనే కలిసి జీవించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement