విలీనంపై క్లాస్‌ | Sakshi
Sakshi News home page

విలీనంపై క్లాస్‌

Published Sun, Aug 13 2017 4:35 AM

విలీనంపై క్లాస్‌

అన్నాడీఎంకే వర్గాలకు మోదీ ఆదేశం
ఎడపాడికి హితవు
పన్నీర్‌కు హెచ్చరిక
ఏకం కాకుండా రావద్దని షరతు

 ‘ఇరువర్గాలు విలీనం కాకుండా ఇక నావద్దకు రావద్దు, వేర్వేరుగా మిమ్మల్ని కలిసేందుకు నేను ఇష్టపడడం లేదు..’ అని ఎడపాడి, పన్నీర్‌ సెల్వంలను ఉద్దేశించి ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈసారి తన కోసం ఢిల్లీకంటూ వస్తే ఇద్దరూ ఒకటిగా రావాలని శుక్రవారం ఢిల్లీలో తనను కలిసిన ఎడపాడి వద్ద ఆయన షరతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మరణం తరువాత అల్లకల్లోలంగా మారిన అన్నాడీఎంకేని బీజేపీ తన కనుసన్నల్లో నడిచేలా మార్చుకుంది. అన్నాడీఎంకే ద్వారా తమిళనాడులో బలమైన పార్టీగా ఎదిగేందుకు పాగా వేసేందుకు పన్నీర్‌సెల్వంను చేరదీసింది. మోదీ అండగా నిలిచినా పన్నీర్‌సెల్వం అధికారంలోకి రాలేక పోయారు. అంతేగాక పార్టీపై పట్టు సాధించలేకపోయారు. సరిగ్గా ఇదే సమయంలో పార్టీ, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం ఎడపాడి ప్రధానికి చేరువయ్యారు.

అయితే ఇరు వర్గాలూ కలిస్తేనే పార్టీకి బలమని భావిస్తున్న ప్రధాని అనేకసార్లు విలీనంపై సూచనలు చేశారు. అంతేగాక శశికళ, ఆమె కుటుంబ సభ్యుల జోక్యం లేని అన్నాడీఎంకేని ఆశిస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. విలీనానికి పన్నీర్‌సెల్వం సైతం ఇదే షరతు పెట్టినా, దీనికితోడు సీఎం లేదా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కావాలని నిబంధన పెట్టడం విలీనానికి విఘాతం ఏర్పడింది. ఈలోగా ఎడపాడిపై దినకరన్‌ కయ్యానికి కాలు దువ్వడంతో అన్నాడీఎంకేలో బలమైన మరోవర్గం తయారైంది.

దినకరన్‌ను నిలువరించాలంటే ఎడపాడి, పన్నీర్‌ ఏకం కావడమే ఏకైక మార్గంగా ఉంది. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు  ప్రమాణ స్వీకారోత్సవ సభకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన ఎడపాడికి ప్రధాని మోదీ క్లాస్‌ పీకినట్లు సమాచారం. ‘విలీనం అంశాన్ని ఎన్నాళ్లు నాన్చుతారు, ఎలాంటి కారణాల చేతనూ విలీనం జాప్యం కారాదు.

శశికళ కుటుంబం లేని అన్నాడీఎంకే నేతలుగా ఈసారి ఇద్దరూ కలిసి ఢిల్లీకి రావాలి, విడివిడిగా వస్తే కలిసేందుకు నాకు ఇష్టం లేదు’ అని నిక్కచ్చిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రధానితో భేటీకి పన్నీర్‌సెల్వం కూడా ప్రయత్నించగా, ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని కార్యాలయ పిలుపు కోసం శుక్రవారం రాత్రి వరకు వేచిచూసిన పన్నీర్‌ సెల్వం ఢిల్లీ, ముంబయి పరిసరాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిపోయారు.

మోదీపై దినకరన్‌ ఫైర్‌.. ఎడపాడికి హెచ్చరిక
మోదీనా లేక లేడీనా (శశికళ) అని గతంలో సవాలు చేసిన అన్నాడీఎంకేపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షకట్టి మూడుముక్కలు చేసిందని టీటీవీ దినకరన్‌ ఒక తమిళ దినపత్రిక ద్వారా పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అమ్మ మరణం తరువాత శశికళ చేతుల్లోకి వెళ్లిన అన్నాడీఎంకే అధికారిక పత్రిక ‘నమదు ఎంజీఆర్‌’లో బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ శనివారం ఒక కవిత ప్రచురించి కలకలం రేపారు.

అలాగే, ఎడపాడి, పన్నీర్‌ శిబిరంలోని ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు దినకరన్‌ గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ పనిని తనవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ‘పరిస్థితులు చేయి దాటిపోయినపుడు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడను’ అంటూ ఎడపాడిని దినకరన్‌ హెచ్చరించారు. దినకరన్‌ మాటల్లోని అంతరార్థం ప్రభుత్వాన్ని కూల్చివేయడమని విశ్లేషకులు అంటున్నారు.

ప్రభుత్వ మనుగడ కొనసాగాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దినకరన్‌ తనవర్గానికి చెందిన 20మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించినా, స్టాలిన్‌ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరైనా ఎడపాడి ప్రభుత్వం 102 ఎమ్మెల్యేల సంఖ్యకు పడిపోతుంది. ఒకవేళ పన్నీర్‌సెల్వం తన వర్గంలోని 11 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించినా ఎడపాడి బలం 113 కు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రభుత్వాని కూల్చివేసేందుకు దినకరన్‌ పూనుకున్నా తటస్థ ఎమ్మెల్యేల్లో కనీసం నలుగురు దక్కక పోతారా అని ఎడపాడి ధీమాతో ఉన్నారు.

ప్రతిపక్షాల ఎద్దేవా
అన్నాడీఎంకేలోని అంతర్గత కలహాలపై బీజేపీ, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇరువర్గాల విలీనంపై ఢిల్లీలో బీజేపీ చెట్టుకింద పంచాయతీకి పూనుకుందని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్‌ వాఖ్యానించారు. రాష్ట్రంలోని ఎడపాడి ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్రప్రభుత్వ అడుగుజాడల్లో నడవాల్సిన పరిస్థితులకు బీజేపీనే కారణమని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement