'మీ కార్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయా?'

5 Jan, 2016 15:24 IST|Sakshi
'మీ కార్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయా?'

న్యూఢిల్లీ: 'మీ కార్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయా?' అని టయోటా, మెర్సిడెజ్ సహా ప్రముఖ కార్ల తయారీ సంస్థలను సుప్రీంకోర్టు పశ్నించింది. పెద్ద డీజిల్ కార్లపై ఢిల్లీలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్న అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద డీజిల్ కార్ల రాకపోకలపై గత నెల నుంచి ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. దీనిపై పునరాలోచన చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

2000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన కార్లను మార్చి 31 వరకు విక్రయించరాదని వాహన తయారీ సంస్థలను ఆదేశించింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన మొదటి 20 నగరాల్లో 13 మనదేశంలోనే ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనంలో వెల్లడైందని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. పెద్ద కార్లు, ఎస్ యూవీలతో పర్యావరణానికి పెద్ద ప్రమాదం ఏమీ లేదని.. అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగానే డీజిల్ కార్లు తయారు చేస్తున్నామని... బొలిరొ, సుమో లాంటి పెద్ద కార్లను సామాన్యులు, గ్రామాల్లోనూ వాడుతున్నారని వాహన తయారీ సంస్థలు వాదించాయి.

ఈ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. 'ఈ వర్గానికి చెందిన ప్రజలు 2000 సీసీ వాహనాలు వాడుతున్నారు? డబ్బున్నవాళ్లు మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు. డీజిల్ కార్లు కాలుష్యం స్వల్పమేనని మీరు చెబుతున్నారు. మీ కార్లు ఆక్సిజన్ వెలువరిస్తాయా?' అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఐఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను ప్రభుత్వం ఎందుకు వాడుతుందని అడిగారు.

>
మరిన్ని వార్తలు