ట్రైనీలపై మహిళా డీఎస్పీ ఆగడాలు..! | Sakshi
Sakshi News home page

ట్రైనీలపై మహిళా డీఎస్పీ ఆగడాలు..!

Published Thu, Aug 25 2016 1:41 PM

ట్రైనీలపై మహిళా డీఎస్పీ ఆగడాలు..!

రాయపూర్ః ఓ మహిళా పోలీసు అధికారి.. ట్రైనీ పోలీసులపై దారుణంగా ప్రవర్తించడం ఛత్తీస్ ఘడ్ లోని ఛంకూరి పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో దిగ్భ్రాంతికి గురి చేసింది. శిక్షణ పొందే మహిళా పోలీసులు వారి  రుతుక్రమ తేదీలను తప్పనిసరిగా చెప్పాలంటూ వేధించడమే కాక, ఆ సమయంలో వారిని డీఎస్పీ బలవంతంగా బయట క్యూలో నిలబెడుతున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్న డీఎస్సీ వేధింపులు భరించలేని ఓ ట్రైనీ.. ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బట్టబయలైంది.

డీఎస్సీ ర్యాంకు అధికారి, అవుట్ డోర్ ఇన్ ఛార్జి నీలకంఠ సాహు.. ప్రవర్తనపై ట్రైనీ పోలీసులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. సాహూ  ట్రైనింగ్ లో ఉన్న ఓ మహిళా పోలీసును బెల్టుతో కొట్టి, దారుణంగా ప్రవర్తించడంతో సదరు ట్రైనీ.. అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల మరో ట్రైనీ పోలీసుపై కూడా సాహూ ట్రైనింగ్ సమయంలో దురుసుగా ప్రవర్తించిందని, స్విమ్మింగ్ పూల్ నుంచి జుట్టుపట్టి లాగి వేధింపులకు పాల్పడిందని ఆరోపించింది. తామంతా ఏదో ఒక రకంగా ప్రతిరోజూ డీఎస్సీ సాహు వేధింపులకు గురౌతూనే ఉన్నామంటూ మరో ట్రైనీ ఫిర్యాదు చేసింది. వేధించేందుకు ఆమెకు వచ్చే ఏ అవకాశాన్ని సాహూ వదలదని, ట్రైనీల రిజిస్టర్ లోని వారి మెన్సురేషన్ తేదీలను బిగ్గరగా అరుస్తూ చెప్తుంటుందని మరో ట్రైనీ ఆందోళన వ్యక్తం చేసింది.

సాహూ వేధింపులపై  పోలీస్ ట్రైనింగ్ లో ఉన్న మొత్తం 32 మంది ట్రైనీల బృందం సంతకాలు చేసిన ఫిర్యాదును పై అధికారులకు అందించారు.  తమ ట్రైనర్ దురుసు ప్రవర్తన, వేధింపులపై పూర్తి వివరాలను ఫిర్యాదులో వివరించారు. దీంతో స్పందించిన అధికారులు సాహూను సదరు విధులనుంచి తప్పించారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ బృందం కూడా పోలీస్ ఆకాడమీని సందర్శించి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంది.

Advertisement
Advertisement