గుజరాత్‌ బీజేపీదే...కానీ!!! | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ బీజేపీదే...కానీ!!!

Published Thu, Dec 7 2017 2:11 AM

Easy win for BJP in Gujarat, but likely to miss 150-seat mark: Times Now-VMR survey - Sakshi

ఏకపక్షమనుకున్న గుజరాత్‌ ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నట్లు ప్రీపోల్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోసారి బీజేపీకే అధికారం దక్కుతుందని చెబుతున్నా.. కమలం పార్టీ ఆశించినన్ని స్థానాలు రాకపోవచ్చని చెబుతున్నాయి. ఏబీపీ–సీఎస్‌డీఎస్‌ సర్వే బీజేపీకి 91–99 స్థానాలు, కాంగ్రెస్‌కు 76–88 స్థానాలు వస్తాయని అంచనా వేయగా.. టైమ్స్‌నౌ–వీఎంఆర్‌ బీజేపీ 111 సీట్లు, కాంగ్రెస్‌ 68 సీట్లు గెలవొచ్చని తెలిపింది. అటు కాంగ్రెస్‌ పుంజుకుంటోంది. నాలుగు నెలల్లో 14% ఓటుబ్యాంకును పెంచుకుంది. 

న్యూఢిల్లీ: గుజరాత్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. కుల, మత సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. దీంతో బీజేపీకి ఏకపక్ష ఫలితాలను తెలిపిన తొలి రెండు ఒపీనియన్‌ సర్వేలకు భిన్నంగా తాజా సర్వేలో కాంగ్రెస్‌ పుంజుకుంటున్నట్లు స్పష్టమైంది. బీజేపీకే అధికారం దక్కుతుందని చెబుతున్నా.. సీట్ల సంఖ్య తగ్గొచ్చని ఏబీపీ–సీఎస్‌డీఎస్, టైమ్స్‌నౌ తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఏబీపీ సర్వే ప్రకారం బీజేపీ 91–99 స్థానాల్లో, కాంగ్రెస్‌ 76–88 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. అయితే టైమ్స్‌ నౌ మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఓట్ల తేడా 5 శాతం ఉంటుందని.. బీజేపీ 111 స్థానాలను, కాంగ్రెస్‌ 68 స్థానాలను కైవసం చేసుకుంటాయని పేర్కొంది. అయితే బీజేపీ అనుకుంటున్నట్లుగా 150+ మార్కును చేరుకోవటం అసంభవమని రెండు సర్వేలు స్పష్టం చేశాయి. మొత్తం సీట్లు 182 కాగా, మేజిక్‌ ఫిగర్‌ 92.

టైమ్స్‌నౌ సర్వే ప్రకారం..
ప్రాంతాల వారీగా బీజేపీ గెలిచే స్థానాల్లో పెద్దగా మార్పులేకపోయినా ఓట్ల శాతంలో స్వల్ప తగ్గుదల ఉందని టైమ్స్‌నౌ–వీఎంఆర్‌ సర్వే పేర్కొంది. మధ్య గుజరాత్‌లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం మంది అనుకూలంగా స్పందించగా.. కచ్, సౌరాష్ట్రల్లో బీజేపీ–44, కాంగ్రెస్‌–41, ఉత్తర గుజరాత్‌లో బీజేపీ–45, కాంగ్రెస్‌–42, దక్షిణ గుజరాత్‌లో బీజేపీ–46, కాంగ్రెస్‌–37 శాతం మద్దతు వ్యక్తమైంది. 2012తో పోలిస్తే అధికార పార్టీకి 3 శాతం ఓట్లు తగ్గగా.. కాంగ్రెస్‌ 1శాతం ఓటు బ్యాంకును పెంచుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ ఏడాది ఆరంభంలో వరదలతో అతలాకుతలమైన ఉత్తర గుజరాత్‌లో బీజేపీ 5 శాతం ఓట్లను కోల్పోనుందని టైమ్స్‌నౌ సర్వే వెల్లడించింది. అయితే మొత్తం ఓటర్లలో కేవలం 7 శాతం మందే.. ఈ ఎన్నికల్లో కుల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడగా.. 31 శాతం మంది పార్టీ ప్రభావం ఉంటుందని, 23 శాతం మంది ‘గుజరాత్‌ గౌరవాన్ని కాపాడటం’ కీలకాంశమని తెలిపారు.

టైమ్స్‌నౌ–వీఎంఆర్‌ సర్వేలో వెల్లడైనవి:
► హార్దిక్, జిగ్నేశ్‌లతో దోస్తీ వల్ల కాంగ్రెస్‌కే లాభమని 47 శాతం మంది అభిప్రాయపడ్డారు. బీజేపీ ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీ అని 34 శాతం మంది పేర్కొన్నారు.
► ప్రపంచబ్యాంకు, మూడీస్‌ రేటింగ్‌ వల్ల బీజేపీకి మేలు జరిగిందని 52 శాతం మంది, కాదని 37 శాతం తెలిపారు.
► జీఎస్టీ పన్నురేట్లలో మార్పు బీజేపీకి కలిసొస్తుందా? అంటే.. 45 శాతం అవునని, 46 శాతం కాదన్నారు.
► రాహుల్‌ దేవాలయాల సందర్శన కాంగ్రెస్‌కు ఓట్లు తెస్తుందా? అంటే 45 శాతం అవునని, 55 శాతం కాదని చెప్పారు.
► రాహుల్‌ ఒక్కరే కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తేగలరా? అన్న ప్రశ్నకు 37 శాతం అవునని, 39 శాతం కాదన్నారు. 24 శాతం మంది మాత్రం ఇతరుల సాయం అవసరమన్నారు.
► సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ వంటి భారీ ప్రాజెక్టులు మోదీకి, బీజేపీకి మేలు చేస్తాయా? అంటే 71 శాతం మంది అవునని, 29 శాతం కాదన్నారు.


ఏబీపీ–సీఎస్‌డీఎస్‌ సర్వే ప్రకారం..
గుజరాత్‌లో 22 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఆగస్టులో తొలి విడత సర్వే ఫలితాలతోపోలిస్తే.. నవంబర్‌ చివరి వారంలో నిర్వహించిన తాజా సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 14 శాతం వరకు ఓట్లను అదనంగా సంపాదించుకోనున్నట్లు తేలింది. అటు బీజేపీ ఓట్ల శాతం కూడా నెమ్మదిగా (ఆగస్టులో 59 శాతం ఓట్లతో 144–152 సీట్లు)తగ్గుతోంది. తాజా అంచనాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చెరో 43 శాతం ఓట్లు పొందుతాయని వెల్లడైంది.

సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా.. ఉత్తర, దక్షిణ, మధ్య గుజరాత్‌లలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. దక్షిణ గుజరాత్‌లో బీజేపీకి 40 శాతం మంది, కాంగ్రెస్‌కు 42 శాతం ఆమోదం తెలిపినట్లు సర్వే చెబుతోంది. ఉత్తర గుజరాత్‌లోని గ్రామాల్లో 41 శాతం మంది బీజేపీ వెంట ఉండగా.. 56 శాతం మంది కాంగ్రెస్‌కే పట్టంగడతామని చెబుతున్నారు. మధ్య గుజరాత్‌లో బీజేపీకి 41 శాతం మంది, కాంగ్రెస్‌కు 40 శాతం మంది మద్దతు తెలిపారు. వ్యాపారులపైనా జీఎస్టీ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. ఇన్నాళ్లూ బీజేపీకి అండగా ఉన్న వ్యాపారుల్లో ఈసారి 43 శాతం మంది కాంగ్రెస్‌కు, 40 శాతం మంది కమలం పార్టీకి మద్దతు తెలిపారు.

కులాల వారీగా..
ఎప్పటిలాగే అగ్రవర్ణ ఓటర్లు బీజేపీకే పట్టం గట్టగా.. కోలీలు, ఓబీసీలూ అధికార పార్టీకే జై కొడుతున్నారు. అటు పటేళ్లకు కాంగ్రెస్‌కు మద్దతిస్తారని భావిస్తున్నా.. ఈ వర్గంలోనూ బీజేపీయే మెజారిటీ ఓట్లు గెలుచుకోవచ్చని తెలుస్తోంది. అయితే, హార్దిక్‌ పటేల్‌కు అండగా నిలుస్తున్న పటేళ్లతోపాటు ముస్లింలు, దళితులు కాంగ్రెస్‌తోనే నడవాలనుకుంటున్నట్లు సర్వేలో తేలింది. మొదటినుంచీ బీజేపీకి అండగా ఉంటున్న ఆదివాసీలూ ఈసారి కాంగ్రెస్‌కు ఓటేయాలనుకుంటున్నట్లు వెల్లడైంది.

క్షత్రియుల ఓట్లూ చీలుతున్నా మెజారిటీ వర్గం హస్తానికే మద్దతివ్వాలనుకుంటున్నారు. అయితే గుజరాతీ ప్రధానిగా ఉన్న మోదీ ప్రభావం కాస్త తగ్గుతోందని ఏబీపీ సర్వే పేర్కొంది. ఆగస్టు సర్వేలో 82 శాతం మంది మోదీనే ఉత్తమ నేతగా పేర్కొనగా.. తాజా సర్వేలో మోదీపై గుజరాతీల అభిమానం 64 శాతానికి తగ్గిపోయింది. బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వటంపైనా గతంలో 50 శాతం మద్దతు తెలిపిన గుజరాతీల సంఖ్య ఈసారి 35 శాతానికి చేరింది. 39 శాతం మంది ప్రభుత్వం మారటమే సరైందని అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement