అలాంటి హామీలిస్తే పార్టీ గుర్తు రద్దుచేస్తాం! | Sakshi
Sakshi News home page

అలాంటి హామీలిస్తే పార్టీ గుర్తు రద్దుచేస్తాం!

Published Tue, Nov 1 2016 1:13 PM

అలాంటి హామీలిస్తే పార్టీ గుర్తు రద్దుచేస్తాం! - Sakshi

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలపై ఎన్నికల కమిషన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఓటు వేసి గెలిపిస్తే చందమామను దింపి తీసుకొస్తామని చెబుతారా అని ప్రశ్నించింది. వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఇస్తున్న హామీలపై అధికారుల పరిశీలన త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రధానంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి వివిద పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలను పరిశీలించనున్నారు. మరీ అమలుచేయడానికి సాధ్యం కాని హామీలు ఇస్తున్నట్లు గుర్తిస్తే.. ఆ పార్టీ ఎన్నికల గుర్తును కూడా మార్చడం లాంటి కఠిన చర్యలు సైతం తీసుకోవాలని భావిస్తున్నారు. 
 
ఇందుకోసం ఎన్నికల కమిషన్‌కు ముందుగానే ఆయా పార్టీలు స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలను అమలుచేయడానికి ప్రభుత్వాలకు ఆర్థికంగా చాలా భారం పడుతోందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కేవలం ఆ హామీలు ఇస్తే మాత్రమే ఓటర్ల విశ్వాసం పొందగలమని ఆ పార్టీలు భావిస్తున్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీ ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పింది గానీ, రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల అప్పులు ఉండటంతో ఆ హామీ నెరవేర్చలేదు. 

Advertisement
Advertisement