కావేరి మంటలను రెచ్చగొట్టిన టీవీ మీడియా | Sakshi
Sakshi News home page

కావేరి మంటలను రెచ్చగొట్టిన టీవీ మీడియా

Published Tue, Sep 13 2016 6:31 PM

కావేరి మంటలను రెచ్చగొట్టిన టీవీ మీడియా - Sakshi

తమిళనాడు రాష్ట్రానికి కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై శాంతియుతంగా బంద్‌ నిర్వహించిన కర్ణాటకలో హఠాత్తుగా విధ్వంసక సంఘటనలు ఎలా ప్రజ్వరిల్లాయి? అందుకు కారకులెవరు? మీడియానే అందుకు కారణమని, ముఖ్యంగా టీఆర్‌పీ రేట్ల కోసం పోటీపడే ఇరు రాష్ట్రాల్లోని టీవీ చానళ్లు ప్రసారం చేసిన రెచ్చగొట్టే సంఘటనలే హింసను రగిలించాయని రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. తమిళనాడులోని ప్రాంతీయ భాషా టీవీ చానళ్లు వారి రాష్ట్రం పక్షాన, కర్ణాటకలోని ప్రాంతీయ భాషా టీవీ చానళ్లు కర్ణాటక పక్షం వహించగా, తమిళనాడు నుంచి ప్రసారం అవుతున్న ఒకే యజమానికి చెందిన తమిళ, కన్నడ భాషా ఛానళ్లు ఒకోవైపు ఒకోలా ఉండి.. ద్వంద్వనీతిని చాటుకున్నాయి. ఫేస్‌బుక్‌లో కర్ణాటక కావేరి నిరసనకారులను విమర్శించారన్న కారణంగా ఓ తమిళ కుర్రవాడిని కన్నడిగులు చితకబాదిన వీడియో క్లిప్పింగ్‌ను ఓ తమిళ చానల్‌ ఆదివారం అంతా ప్రసారం చేసింది.

దీంతో రెచ్చిపోయిన కొంతమంది తమళ యువకులు సోమవారం ఉదయం మైలాపూర్‌లోని 'న్యూ ఉడ్‌ల్యాండ్‌' హోటల్‌పై పెట్రోలు బాంబులను విసిరారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆ హోటల్‌ తమిళనాడులో స్థిరపడిన నాలుగో తరం కన్నడ కుటుంబానికి చెందినది. టీవీ మీడియా సంఘటనా స్థలానికి వచ్చి లైవ్‌ కవరేజ్‌ పేరుతో హంగామా చేయడంతో బెంగుళూరు, మైసూర్‌ నగరాల్లో ప్రతీకార దాడులు ప్రారంభమయ్యాయి. తమిళనాడు రిజిస్ట్రేషన్‌ నెంబర్లను లక్ష్యంగా చేసుకొని వాహనాలను తగులబెట్టారు. చెన్నైకి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆర్కే రాధాకృష్ణన్, జస్ట్‌ కన్నడ డాటా కామ్‌ ఎడిటర్‌ మహేశ్‌ కొల్లీగల్‌ తదితరులు మీడియా తీరును తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సమయాల్లో సంయమనం పాటించాల్సిన మీడియా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించిందని, లైవ్‌ కవరేజ్‌ పేరిట టీఆర్‌పీ రేటింగ్‌ కోసం చానళ్లు పాకులాడాయని వారు విమర్శించారు.
 
ఈసారి సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ కురుస్తుందని భావించినా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువగా కురవడం, కావేరి బెల్ట్‌లోని రిజర్వాయర్లు పూర్తిగా నిండకపోవడం కావేరి జలాల జగడానికి దారితీసింది. కర్ణాటకలో రిజర్వాయర్లు 70 శాతం నిండగా, తమిళనాడులోని రిజర్వాయర్లు 51 శాతం మాత్రమే నిండాయి. ఈ నేపథ్యంలో జలాల విడుదలకు కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాల్సి వచ్చింది.

Advertisement
Advertisement