‘ఉపాధి’ ఇక పరిమితం! | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ ఇక పరిమితం!

Published Sun, Nov 2 2014 12:11 AM

employment guarantee to be short listed

సాక్షి, న్యూఢిల్లీ:  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఏ)లో భారీ మార్పులు తెచ్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 650కి పైగా జిల్లాల్లో అమలవుతున్న  ఈ పథకాన్ని కేవలం వెనకబడిన 200 జిల్లాలకే పరిమితం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు ఖర్చు చేసిన 2.6 లక్షల కోట్లలో అధిక భాగం వేతనాలకే వ్యయమైందని, ఆస్తులు, అభివృద్ధి పనులుగా మలచుకోలేకపోయారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న వేతనం, ఆస్తుల నిర్మాణ సామగ్రి(మెటీరియల్) నిష్పత్తిని 60ః40 నుంచి 51ః49కి మార్చనున్నట్టు ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.
 
 2006లో ప్రారంభమైన ఉపాధి హామీ చట్టం గ్రామీణ నిరుద్యోగులకు వరంగా మారింది. దీని ప్రకారం ఉపాధి అందించలేని రోజులకు నిరుద్యోగ భృతి చెల్లించాలి. ఉపాధి హామీ చట్టం కింద తొలుత 100 రోజుల ఉపాధి పథకాన్ని 2006 ఫిబ్రవరి 6న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అనంతపురంలో ప్రారంభించారు. తొలి దశలో 200 జిల్లాలోనే దీన్ని అమలు చేశారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అమలుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాగా వెనకబడిన, కరువు ప్రభావిత ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, విజయనగరం, వరంగల్, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్  జిల్లాల్లో తొలి విడత అమలైంది. అయితే పథకంతో అభివృద్ధి కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా పోయిందని గతంలోనే విమర్శలు వచ్చాయి. ఇది కేవలం నగదు బదిలీగా మారిపోయిందని, లక్షల కోట్లు ఖర్చు చేసినా ఎలాంటి అభివృద్ధి ఆస్తులనూ సమకూర్చుకోలేకపోయామని ప్రస్తుత ఎన్డీఏ సర్కారు భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ పథకం కాంగ్రెస్ మళ్లీమళ్లీ అధికారంలోకి రావడానికి తెచ్చిన ఓటు బ్యాంకు పథకమని విమర్శించారు. మరోపక్క..  ఈ పథకం వల్ల వ్యవసాయ పనులకు ఎవరూ రావడం లేదని, వచ్చినా రోజుకు రూ. 200 కూలి ఇవ్వాల్సి వస్తోందని పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతులు ఆందోళన చెందుతున్నారు. కారణమేదైనా ఈ పథకాన్ని సంస్కరించి, మరింత పారదర్శకతతో, పెట్టిన ఖర్చుకు ఫలితం దక్కేలా, అభివృద్ధి పనులు కళ్ల ముందు కనిపించేలా పథకంలో మార్పులు తేవడానికి  ప్రభుత్వం సిద్ధమవుతోంది.
 
 సంస్కరణలు ఇలా..
 
 పథకం ప్రక్షాళనలో భాగంగా.. ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేయాలని, కూలీల శ్రమ వృథా కాకుండా అభివృద్ధి పనులను ఆస్తులుగా మలిచే కార్యక్రమాలు రూపొందించాలని ఎన్డీఏ సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా మెజారిటీ వ్యయాన్ని కరువు పనుల పేరిట ఖర్చు చేస్తున్నందున.. పథకం నిధులను  కరువు జిల్లాల్లోనే ఖర్చు పెడితే ఎలా ఉంటుందని యోచిస్తోంది. 200 జిల్లాలకు లేదా 2,500 బ్లాకులకు పరిమితం చేయాలని, ఉపాధి పనుల్లో మెటీరియల్ నిష్పత్తి పెంచడం వల్ల మౌలిక ఆస్తులను సృష్టించవచ్చని భావిస్తోంది. వచ్చే బడ్జెట్ నాటికి కేంద్రం కీలక సంస్కరణలకు సిద్ధం చేసే అవకాశముంది. ఎన్డీఏ సర్కారు ఈ పథకాన్ని రాజకీయ క్రీడగా మార్చుతోందని కాంగ్రెస్ తప్పుపడుతుండగా.. ప్రభుత్వ నేతలు మాత్రం పెదవి విప్పడం లేదు.
 
 సగానికి తగ్గిన నిధుల విడుదల
 ఈ పథకం నిధులు క్రమంగా తగ్గిపోతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన నిధులతో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నిధుల విడుదల  45 శాతం త గ్గింది. గత ఏడాది ఇదే కాలానికి రూ. 24,676 కోట్లు విడుదల కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 13,618 కోట్లు మాత్రమే విడుదలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.  
 
 ‘ఇబ్బందులున్నా... గణనీయ ఫలితాలు..’
 
 ఈ పథ కాన్ని కొన్ని జిల్లాలకే పరిమితం చేయొద్దని ఇటీవల 28 మంది ప్రముఖ ఆర్థిక వేత్తలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. అనేక ఇబ్బందులు ఉన్నా.. ఈ పథకం గణనీయ ఫలితాలు కనబరిచిందని పేర్కొన్నారు. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో కేవలం 0.3 శాతం ఖర్చుతో 5 కోట్ల్ల కుటుంబాలకు ఉపాధి దొరుకుతోందని వివరించారు. ఈ పథక లబ్ధిదారుల్లో సింహభాగం మహిళలేనని, వీరు కూడా దళితులు, ఆదివాసీలేనని తెలిపారు. పథకంలో అవినీతి క్రమంగా తగ్గిపోతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయని వివరించారు. మరోవైపు..  గ్రామాల్లో ఉపాధి హామీ పనులు తగ్గి కూలీలు కూడా ఆందోళన చెందుతున్నారు.  2014-15 ఆర్థిక సంవత్సరంలో నిధులు తగ్గడంతోనే పనులు, పని దినాలు తగ్గిపోయాయని జిల్లా, మండలస్థాయి అధికారులు చెబుతున్నారు.


 

Advertisement
Advertisement