సునామీ మృతులకు స్మృత్యంజలి | Sakshi
Sakshi News home page

సునామీ మృతులకు స్మృత్యంజలి

Published Sat, Dec 27 2014 1:50 AM

సునామీ మృతులకు స్మృత్యంజలి - Sakshi

  • తమిళనాడు వ్యాప్తంగా నివాళులర్పించిన ప్రజలు
  • సముద్రుడికి పూజలు
  • సాక్షి, చెన్నై: చెన్నై తీరాన్ని అతలాకుతలం చేసి సుమారు 7 వేల మందిని పొట్టనపెట్టుకున్న సునామీ ఘటన జరిగి పదేళ్లు కావడంతో తమిళనాడువ్యాప్తంగా ఆ మృతులకు శుక్రవారం నివాళులర్పించారు. హిందూ మహాసముద్రంలో సంభవించిన పెను భూకంపం కారణంగా ఇండోనేసియాలోని సుమిత్రా దీవుల్లో ప్రారంభమై, అండమాన్ మీదుగా  2004లో  చెన్నై తీరాన్ని తాకిన జలప్రళయం ఎన్నో జీవితాలను కబళించిన సంగతి విదితమే.

    ఈ సందర్భంగా చెన్నై, నాగపట్నం తదితర ప్రాంతాల్లో బాధిత కుటుంబాల , మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రఖ్యాత మెరీనా బీచ్‌లో మహిళలు సముద్రునికి క్షీరాభిషేకం చేశారు. ఇకపై ఉగ్రరూపం దాల్చవద్దని మొక్కుకున్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం సాగర తీరం వద్ద సామూహికంగా మౌనం పాటించారు. పుదుచ్చేరీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రంగస్వామి, స్పీకర్ వి.సభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు సునామీ మృతులకు నివాళులర్పించారు. ఇతర ఆసియా దేశాల్లోనూ సునామీ మృతులకు నివాళిగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
     
    ఐరాస సహాయ నిధికి భారత్ సాయం


    సునామీ సహా ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన సహాయ నిధికి రూ.6.35 కోట్ల సాయాన్ని భారత్ శుక్రవారం ప్రకటించింది. థాయ్‌ల్యాండ్‌లోని భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా ఈ మేరకు ప్రకటన చేశారు.
     

Advertisement
Advertisement