‘కసబ్‌కీ బేటీ’ అన్నారు! | Sakshi
Sakshi News home page

‘కసబ్‌కీ బేటీ’ అన్నారు!

Published Tue, Nov 27 2018 5:23 AM

The Eye-witness and Survivor of Kasab’s 26/11 Mumbai Attack - Sakshi

దశాబ్దం క్రితం జరిగిన 26/11 ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ల దేవిక. ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్‌(సీఎస్టీ)లో అమాయకులను పొట్టనబెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్‌ను పోలీసులు పట్టుకున్నాక అతడిని పోలీసు పరేడ్‌లో గుర్తుపట్టిన అత్యంత చిన్న వయసు ప్రత్యక్ష సాక్షి ఈమె. ఉగ్రవాదిని గుర్తించడంలో సాయంచేసినందుకు ఆ కుటుంబం ఎదుర్కొన్న చేదు అనుభవం ఒకటైతే, ఆ చిన్ని మనసును నొప్పించిన ఘటనలెన్నో. 2008 నవంబర్‌ 26న ఉగ్రబుల్లెట్ల నుంచి దేవిక త్రుటిలో తప్పించుకుంది.

కసబ్‌ని గుర్తుపట్టి, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు నాడు కోర్టు మెట్లెక్కినపుడు దేవిక వయసు తొమ్మిదేళ్లు. ఘటన జరిగినపుడు ఆమె వయసు కేవలం ఆరేళ్లు. ‘నా కుడి కాలుని షూట్‌ చేశారు’ అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది దేవిక. ప్రస్తుతం దేవిక ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. దాడి జరిగిన రోజు పుణెలోని తన చిన్న అన్నయ్యను కలవడానికి తండ్రి నట్వర్‌లాల్, పెద్ద అన్నయ్యలతో కలిసి రైలెక్కడానికి ముంబై సీఎస్టీకి వచ్చింది. అదే సమయంలో రైల్వేస్టేషన్‌లో కసబ్‌ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్‌ దేవిక కుడి కాలును చీల్చుకుంటూ దూసుకెళ్లింది. రక్తసిక్తమైన దేవిక రెండు నెలల పాటు ఆసుపత్రిపాలైంది.

కోలుకుని కోర్టుకెళ్లిన దేవికను ‘నిన్నెవరు కాల్చారు?’ అని ప్రశ్నించినపుడు సూటిగా కసబ్‌ వైపు చూపించింది. దీంతో అప్పట్లో దేవిక పేరు మార్మోగింది. దేశం యావత్తు ఆ చిన్నారి తెగువను ప్రశంసించింది. అయితే, దేవికను కష్టాలు మరోరూపంలో మొదలయ్యాయి. బడిలో తోటి విద్యార్థినులు ‘కసబ్‌కీ బేటీ’ అని పిలిచేవారు. స్నేహితులు దగ్గరికి రావడానికి భయపడ్డారు. సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో దేవిక మరో పాఠశాలలో చేరాల్సి వచ్చింది. అక్కడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. దీనికితోడు దేవిక కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అయినా దేవిక, ఆమె కుటుంబం వెనక్కి తగ్గలేదు.  దేవిక తండ్రి రోజుకూలీ. ఇంత పేదరికంలోనూ తను లక్ష్యంగా పెట్టుకున్న ఐపీఎస్‌ ఆశయాన్ని సాధించేందుకు దేదిక కష్టపడి చదువుతోంది. 


26/11 మృతులకు సోమవారం జమ్మూలో నివాళులర్పిస్తున్న పాఠశాల విద్యార్థులు

Advertisement
Advertisement