ఫేస్ బుక్ ద్వారా 'బూస్ట్ యువర్ బిజినెస్' | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ ద్వారా 'బూస్ట్ యువర్ బిజినెస్'

Published Sat, Apr 16 2016 8:51 PM

ఫేస్ బుక్ ద్వారా 'బూస్ట్ యువర్ బిజినెస్' - Sakshi

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్... మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతోంది. గ్రామాల్లోని చిన్న తరహా పరిశ్రమల వ్యాపారాభివృద్ధికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భారత్ లోని పల్లెలకు  'బూస్ట్ యువర్ బిజినెస్ '  పేరిట్ ప్రత్యేక కార్యక్రమాన్ని పరిచయం చేసి, అక్కడి వ్యాపారాలను పెంచుకునే విధంగా సహాయ పడేందుకు కృషి చేస్తోంది.

భారతదేశంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన చేతివృత్తులు, కళలపై ఫేస్ బుక్.. దృష్టి సారించింది. ముఖ్యంగా గ్రామాల్లో తయారయ్యే అనేక కళాత్మక వస్తువులు, నేత పరిశ్రమల అభివృద్ధికి   ప్రాధాన్యతనిస్తూ ఆయా వ్యాపారాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తోడ్పడే ప్రయత్నం చేస్తున్నట్లు ఫేస్ బుక్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ ఇనీషియేటివ్స్ అధికారి రితేష్ మెహతా తెలిపారు. ఒక సంస్థ అధికంగా వ్యాపారం చేయడం కష్టమని, అందుకే తాము అనేక సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాపారాలను అభివృద్ధి పరిచే ప్రయత్నం చేస్తున్నామని మెహతా తెలిపారు. ఇందులో భాగంగా పది వరకూ ఎన్జీవో లు లేదా ప్రభుత్వాలతో కలసి పనిచేసేందుకు ఫేస్ బుక్ సిద్ధమౌతున్నట్లు రితేష్ వెల్లడించారు.  ముఖ్యంగా వృత్తులు, కళలకు ఫేస్ బుక్ మంచి వేదిక అని, అందుకే దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాల  అభివృద్ధికి  వినియోగించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

ఉత్తర ప్రదేశ్ లోని ఐదారు నగరాలతోపాటు ముఖ్యంగా గ్రామాల్లో పర్యటించిన ఫేస్ బుక్ తన కొత్త ప్రయత్నంలో భాగంగా బెనారస్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని నేత కార్మికులకు, అలాగే కనౌజ్, కాన్పూర్ ప్రాంతాల్లోని ప్రజలకు ఫేజ్ బుక్ వినియోగంపై అవగాహన కల్పించింది. ముందుగా గుజరాత్ గ్రామాల్లోని కళాకారులతో అత్యంత సన్నిహిత సంబంధాలు పెనవేసుకున్న ఎన్జీవో సంస్థ 'సేవా'  తో కలసి తమ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు చెప్తున్న  ఫేస్ బుక్ ప్రతినిధులు... భాగస్వామ్యం విషయంలో మాత్రం స్పష్టతను ఇవ్వలేదు. అలాగే కర్నాటక ప్రభుత్వంతో కూడ వ్యాపారాభివృద్ధిపై చర్చించినా.. రాష్ట్రంలోని నగరాలకు ఎటువంటి ప్యాకేజ్ ను ప్రకటిస్తుందో తెలుపలేదు.

ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరుతోపాటు దేశంలోని ఏడు నగరాల్లో పర్యటించిన ఫేస్ బుక్ ప్రతినిధులు.. 4000 మంది మహిళా వ్యాపారస్తులకు శిక్షణ ఇచ్చారు. ఈ సంవత్సరం చివరినాటికి మొత్తం 20 నుంచి 25 నగరాల్లో మహిళా వ్యాపారవేత్తలకు ఫేస్ బుక్  సాంకేతిక వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ధి పరచుకునే వీలుంటుందని మెహతా తెలిపారు. ఇప్పటికే తాము నిర్దేశించుకున్న నగరాల్లో జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్ ఉన్నాయని అక్కడకూడ పర్యటించి ఫేస్ బుక్ లో వ్యాపార లావాదేవీలకు సంబంధించి అవగాహనను కల్పించనున్నట్లు సోషల్ నెట్వర్క్ సంస్థ అధికారులు చెప్తున్నారు.

Advertisement
Advertisement