బకాయిలు చెల్లించలేదని సోనియాపై కేసు | Sakshi
Sakshi News home page

బకాయిలు చెల్లించలేదని సోనియాపై కేసు

Published Wed, Jun 8 2016 12:17 PM

బకాయిలు చెల్లించలేదని సోనియాపై కేసు - Sakshi

తిరువనంతపురం: గత లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వెంటాడుతున్న వరుస ఓటములు, కీలక నేతలు పార్టీ నుంచి వైదొలగడం, నాయకత్వ మార్పుపై గందరగోళం.. ఇలా పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో ఇరుక్కుంది. బకాయిలు చెల్లించని కేసులో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ చిక్కుల్లోపడ్డారు. తిరువనంతపురం కోర్టులో సోనియాపై కేసు నమోదైంది.

కేరళలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ భవనాన్ని నిర్మించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తమకు కాంట్రాక్టు ఇచ్చిందని, దీనికి సంబంధించి 2.8 కోట్ల రూపాయల బకాయిలను తమకు చెల్లించలేదని ఆ రాష్ట్రానికి చెందిన హీథర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆరోపించింది. ఈ విషయం గురించి అడిగితే కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు తమ వద్ద డబ్బులు లేవని చెబుతున్నారని వెల్లడించింది. తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హీథర్ కన్స్ట్రక్షన్ కంపెనీ తిరువనంతపురం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సోనియా గాంధీతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీలకు లీగల్ నోటీసులు పంపించింది.  

కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన కొన్ని రోజుల్లోనే ఈ కేసు వెలుగు చూసింది.

Advertisement
Advertisement