ఘోర అగ్ని ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా శవాలు | Sakshi
Sakshi News home page

ఘోర అగ్ని ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా శవాలు

Published Thu, Sep 7 2017 9:09 AM

ఘోర అగ్ని ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా శవాలు - Sakshi

సాక్షి, ముంబై: ఘోర అగ్ని ప్రమాదం మహారాష్ట్రలో ఆరుగురి ప్రాణాలు బలి తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనంలో మంటలు చెలరేగటం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
 
జుహులోని విలే పార్లే ప్రాంతంలో ఓ 13 అంతస్థుల భవన నిర్మాణం జరుగుతోంది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భవనంలో మంటలు చెలరేగటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో చాలా మట్టుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలుగా తెలుస్తోంది. వారంతా అందులోనే ఉంటూ పనులు చేస్తున్నారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. గాయపడిన వారిని ఆర్‌ఎన్‌ కూపర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడు ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
 
ప్రమాదానికి గల కారణాలు తెలియరానప్పటికీ, ప్రత్యక్ష సాక్ష్యులు పెద్ద పేలుడు శబ్ధం విన్నామని చెబుతుండగా.. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎల్పీజీ సిలిండర్ పేలటమే ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాలు గుర్తుపట్టలేనంత దారుణంగా తయారయ్యాయని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో నలుగురు కూలీలు కనిపించకుండా పోవటంతో వారు శిథిలాల కింద ఉన్నారేమోనని గాలింపు చర్యలు చేపట్టారు.  ఘటనకు నిర్లక్ష్యమే గనుక కారణమైతే భవన యాజమానిపై కఠిన చర్యలు ఉంటాయని మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement