బరంపురం నగరానికి వరద ముప్పు | Sakshi
Sakshi News home page

బరంపురం నగరానికి వరద ముప్పు

Published Fri, Jul 6 2018 1:42 PM

The Flood Threat To The City Of Barampuram - Sakshi

బరంపురం : ఒడిశాలో అతిపురాతనమై నగరాల్లో ఒకటైన బరంపురానికి వరద ముప్పు పొంచి ఉంది. నగరానికి ఉత్తరవైపు బానానాలా, దక్షిణాన సప్పునా కెనాల్‌ల ద్వారా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ పర్వతాల అడ్డుతో బరంపురం నగరాన్ని   వరద ముంచెత్తనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో సైక్లోన్‌ జోన్‌గా గుర్తింపు పొందిన గంజాం జిల్లా, బరంపురం నగరం  పైలీన్‌ తుఫాన్‌ నాటి దృశ్యాలను తలపిస్తున్నాయి. దేశ భౌగోళిక స్థితి స్వభావంతో గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్‌ తీరంలో విపత్తులు విరుచుకుపడే సూచనలు అధికంగా ఉంటాయి. ఇందుకు గోపాల్‌పూర్‌ తీరంలో 1999లో వచ్చిన సూపర్‌ సైక్లోన్, 2013లో వచ్చిన పైలీన్‌ తుఫాన్, 2014లో వచ్చిన హుద్‌హుద్‌  తుపానులే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతం తుఫాన్‌లు సంభవించే సీజన్‌ కావడం, దక్షిణ ఒడిస్సాలో అల్పపీడనం కొనసాగుతుండగా, సముద్ర ఉపరితలంపై మరో ఆవర్తనం ఏర్పడడంతో గంజాం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాననాలాలో పేరుకు పోయిన ప్లాస్టిక్‌ పర్వాతాల అడ్డుతో బరంపురం నగరం వరద గుప్పిట్లో దిగ్బంధం కానుంది. కొద్దిరోజుల క్రితం ముంబై నగరాన్ని ముంచెత్తిన వరదలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

వరద పోటుకు కారణాలు

  •  ముంబై మాదిరిగా ప్లాస్టిక్‌ పేరుకుపోవడం 
  •  నగరంలో నింబధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ వాడకం 
  •  వర్షం కురిసినప్పుడు కాలువల్లో కొట్టుకుపోయిన ప్లాస్టిక్‌ వస్తువులన్నీ ఒకచోటచేరి పర్వతంలా పేరుకుపోతుండడంతో ముంబై తరహా ముంపు బరంపురం నగరానికి       పొంచి ఉంది. 
  •  నగరంలో పాలనా యంత్రాంగం చేపట్టిన కాంక్రీట్‌ రోడ్లు, తారు రోడ్ల నిర్మాణాల వల్ల నీరు ఇంకడానికి అవకాశం లేకపోవడం  
  •  నగరంలోని అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయకపోవడం. 
  •  జల వనరులు, అడవులు, నేల స్వభావంతో సైక్లోన్‌ జోన్‌గా గంజాం జిల్లాకు  గుర్తిపు 
  •  బానా నాలా, సప్పువా నాలా పునర్నిర్మాణం కోసం వచ్చిన ఒడిశా ప్రకృతి వైపరీత్యాల పునరావాస పథకం (ఓడీఆర్‌పీ) నిధులు పక్కదారి పట్టడం

తీసుకోవలసిన జాగ్రత్తలు  

  •  బీఎంసీ తక్షణమే నగరంలో గల కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, ప్లాస్టిక్‌ను తొలిగించి ప్రతిరోజూ కాలువలు క్లీన్‌ చేయాలి.
  •  నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, ప్లాస్టిక్‌ అమ్ముతున్న దుకాణాలపై దాడి చేయాలి.
  •  నగరానికి ఇరువైపులా ఉన్న బాననాలా, సప్పువా నాలా నిర్మాణాలు వెంటనే చేపట్టాలి. 
  •  నగరంలో కాలువల నిర్మాణాలను బీఎంసీ సక్రమంగా చేపట్టాలి
  •  నగరంలో కాలువలపై ఆక్రమణలను  తొలగించాలి 
  •  ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి

Advertisement
Advertisement