విలువలు పాటించండి..! | Sakshi
Sakshi News home page

విలువలు పాటించండి..!

Published Sun, Jun 29 2014 2:17 AM

విలువలు పాటించండి..! - Sakshi

బీజేపీ కొత్త ఎంపీలకు మోడీ దిశానిర్దేశం
సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన శిక్షణ శిబిరం


న్యూఢిల్లీ: ‘ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంటులోనూ, ప్రజల్లో ఉన్నప్పుడూ మీ వ్యవహార శైలి, ప్రవర్తనపై దృష్టి పెట్టండి. విలువలతో కూడిన ప్రజాజీవితం గడపండి. మీ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయండి. సుపరిపాలన సందేశాన్ని వ్యాప్తి చేయండి’.. తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కర్తవ్య బోధ ఇది. లోక్‌సభ, రాజ్యసభల్లో తొలిసారి అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు రెండురోజుల శిక్షణశిబిరాన్ని ఢిల్లీ శివార్లలోని సూరజ్‌కుండ్(హర్యానా)లో శనివారం మోడీ ప్రారంభించారు. ‘పార్లమెంటు సభ్యుడు కావడం గొప్పవిషయం.

ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి రావడమంటే కొన్ని సీట్లు మారి అటునుంచి ఇటు వచ్చినట్లు కాదు. ఇదో కీలక మార్పు. ఇప్పుడు మీపై బాధ్యతలు మరింత పెరిగిన విషయాన్ని గుర్తించాలి’ అని వారికి బోధించారు. ‘నేనూ లోక్‌సభకు మొదటిసారే వచ్చాను. నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది’ అన్నారు. నూతన ఎంపీలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కొందరు ఎగతాళి చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయ వ్యవస్థల్లో మానవవనరుల అభివృద్ధికి శిక్షణ వ్యవస్థ లేకపోవడం పెద్ద లోపమని వ్యాఖ్యానించారు. మోడీ దిశానిర్దేశం లోని కొన్ని ముఖ్యాంశాలు..

⇒  సహచరులతో విభేదాలుంటే వాటిని బహిరంగంగా వ్యక్తపరచవద్దు. అంతా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్న స్నేహితుల్లా, ఒక కుటుంబంలా వ్యవహరించాలి.
⇒   చిన్నచిన్న విషయాలకు హైరానా పడవద్దు. రాజకీయాల్లో ఫుల్‌స్టాప్ ఉండదు.
⇒  పార్లమెంటులో చేసే ప్రసంగంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. అది క్లుప్తంగా ఉండేలా చూసుకోండి. వివిధ అంశాలపై లోతైన పరిజ్ఞానం పెంచుకోండి.
⇒ ఆరునెలల్లో నియోజకవర్గ అభివృద్ధిపై నివేదికను సిద్ధం చేయండి.
⇒  పార్లమెంటు రూల్‌బుక్‌ను భగవద్గీతలా భావించండి. దాన్ని అతిక్రమించకండి.
⇒  సభాధ్యక్షుడిని గౌరవించాలి. వారి అనుమతి లేకుండా చట్ట సభలో ఏమీ చేయకూడదు. ప్రభుత్వ నిర్ణయాలకు ఎంపీలు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారే పనులు చేసి విపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వొద్దు.
⇒ కుటుంబపాలన, అవినీతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరపరాజయం ఎదురైంది. అలాంటి మచ్చ తెచ్చుకోకుండా వాటికి దూరంగా ఉండాలి.
⇒  దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలేవీ తీరలేదన్న విషయాన్ని వీలైన ప్రతీచోటా ప్రముఖంగా ప్రస్తావించండి. పార్టీ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోండి.

శిక్షణతో నాణ్యత..రాజ్‌నాథ్

 కార్యక్రమంలో అధ్యక్షోపన్యాసం చేసిన రాజ్‌నాథ్ సింగ్.. ఇలాంటి శిక్షణల ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను అత్యంత నాణ్యమైన ప్రజాస్వామ్యంగా రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని, ప్రజల ఆకాంక్షల భారాన్ని అర్థం చేసుకోవాలని ఎంపీలకు సూచించారు. కార్పొరేట్ సంస్థల వలలో చిక్కుకుపోవద్దని, కార్యదర్శుల నియామకంలో జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కొత్త ఎంపీలను హెచ్చరించారు. కొన్నేళ్ల క్రితం ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకుని సస్పెండ్ అయిన ఎంపీల ఉదంతాన్ని ఆమె గుర్తుచేశారు.  శిక్షణ శిబిరానికి 170 మంది లోక్‌సభ, 25 మంది రాజ్యసభ సభ్యులకు ఆహ్వానాలు వెళ్లగా నలుగురైదుగురు మినహా అంతా హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. కాగా, బీజేపీ శిక్షణ కార్యక్రమంపై కాంగ్రెస్ వ్యంగ్యోక్తులు విసిరింది. ‘మొదటిసారి ఎంపీగా ఎన్నికైన నరేంద్ర మోడీ.. పార్లమెంటరీ వ్యవస్థ లోతుపాతుల గురించి 195 మంది కొత్త ఎంపీలకు పాఠాలు చెబుతున్నారు. ఇది వింతగా లేదూ?’ అంటూ ట్విట్టర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆదివారం ట్వీట్ చేశారు.
 
 

Advertisement
Advertisement