సంస్కరణల సారథి | Sakshi
Sakshi News home page

సంస్కరణల సారథి

Published Sun, Aug 25 2019 3:06 AM

Former Finance Minister Arun Jaitley passed away - Sakshi

దివాలా చట్టంతో బ్యాంకులకు ఊరట ఒకపక్క స్కాముల కంపు కొడుతున్న వ్యవస్థ, మరోపక్క దిగజారిన విదేశీ నిధులు!!. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎకనమిస్టుకైనా సంస్కరణల అమలు కత్తిమీద సామే. కానీ ఈ రాజకీయ లాయర్‌కు మాత్రం అది ఒక సంక్లిష్టమైన కేసులాగే కనిపించింది. దాన్ని గెలిచేవరకు వదలకూడదన్న పట్టుదలతో రోజుకు 16 గంటలు పనిచేస్తూ చివరకు కేసు గెలిపించారు. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు.

అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎకానమీలో రెండు అతిపెద్ద కుదుపులు సంభవించాయి. 2016లో ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ఎకానమీని స్తంభింపజేసింది. దీంతో దాదాపు రెండు త్రైమాసికాల పాటు జీడీపీ ఒక్కసారిగా కుంచించుకుపోయింది. షాక్‌ తిన్న ఎకానమీని పట్టాలెక్కించి తిరిగి జీడీపీని గాడిన పెట్టడంలో జైట్లీది కీలక పాత్ర. ఒకపక్క ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మరోపక్క నిర్ణయ పర్యవసానాలను ఎదుర్కొంటూ ఆయన అత్యంత సమర్ధవంతంగా ఎకానమీని నడిపించారని ఎకనమిస్టులు ప్రశంసిస్తారు. నోట్ల రద్దు తర్వాత ఏడాది జీఎస్‌టీ అమలు చేయడం ద్వారా అప్పటివరకు ఉన్న పన్ను వ్యవస్థ మొత్తాన్ని కదలించారు.

నోట్ల రద్దుతో సతమతమై కుదుటపడుతున్న ఆర్థిక వ్యవస్థకు జీఎస్‌టీ మరో షాక్‌లాగా తగిలింది. దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ఆలోచనల్లోనే ఉంటూ వచ్చిన ఒకే దేశం, ఒకే పన్ను వ్యవస్థను జైట్లీ సాకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ ‘‘పాత భారతం ఆర్థికంగా ముక్కలుగా కనిపిస్తోంది, కొత్త భారతం ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్‌గా మారుతుంది’’ అన్నారు. ఇండియా ఎకానమీలో అతిపెద్ద సంస్కరణగా జీఎస్‌టీని ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు. కేవలం సంస్కరణను ప్రవేశపెట్టడం కాకుండా, ఎప్పటికప్పుడు దాని అమలును సమీక్షిస్తూ, అవసరమైన మార్పులు చేస్తూ జైట్లీ జీఎస్‌టీని సానుకూలంగా మార్చారు. రాజకీయంగా కూడా జీఎస్‌టీ పట్ల దాదాపు ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆయన విజయంగా నిపుణులు అభివర్ణిస్తారు.  

ఎగవేతదారులకు చెక్‌
ఈ రెండు సంస్కరణలతో పాటు జైట్లీ హయాంలో తీసుకువచ్చిన మరో ముఖ్యమైన సంస్కరణ దివాలా చట్టం ఏర్పాటు చేయడం. ఈ చట్టంతో క్రెడిట్‌ కల్చర్‌లో మంచి మార్పులు వచ్చాయి. రుణదాతలకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎగవేతలంటే భయపడే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా క్రోనీ క్యాపిటలిజం నిర్మూలనకు ఇది సమర్ధవంతంగా పనిచేసిందని ప్రముఖ ఎకనమిస్టులు కొనియాడారు. ఆర్‌బీఐ, ద్రవ్యపరపతి సమీక్ష అంశాలపై జైట్లీకి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కేంద్రబ్యాంకుకు మరింత స్వయం ప్రతిపత్తి ఉండాలని, ద్రవ్యోల్బణం కట్టడే సమీక్షా సమావేశ ప్రధాన అజెండా కావాలని ఆయన అభిప్రాయపడేవారు. ఆయన మరణం పట్ల అటు రాజకీయనాయకులతో పాటు ఇటు కార్పొరేట్‌ వర్గాలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక సంస్కరణలు సమర్ధవంతంగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా కార్పొరేట్‌ ప్రపంచం జైట్లీని కొనియాడుతోంది.      

దేశాభివృద్ధికి విశేష కృషి: కోవింద్‌
జైట్లీ మరణం తీవ్రవిచారకరం. ఆయనో న్యాయవాది, గొప్ప పార్లమెంటేరియన్, సమర్థుడైన మంత్రి. ఈ దేశ పురోగతి కోసం ఆయన ఎంతో కృషిచేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
 
విలువైన మిత్రుడు: వెంకయ్య
జైట్లీ లేని లోటు పూడ్చలేనిది. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు నష్టమే. పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి మరువలేనిది. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు.
 
స్నేహితుడిని కోల్పోయా: మోదీ
జైట్లీ మృతితో ఒక విలువైన స్నేహితుడిని కోల్పోయానంటూ ప్రధాని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. బహ్రెయిన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి భారత సంతతి ప్రజలతో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. ‘దేశం కోసం నిరంతరం సేవ చేసిన అత్యున్నత మేధో సంపత్తి కలిగిన దిగ్గజ రాజకీయ నేత అరుణ్‌ జైట్లీ. నాకు విలువైన మిత్రుడు. ఆయన లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అరుణ్‌ జైట్లీ ఎన్నో మంత్రిత్వ శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.  కొద్ది రోజుల క్రితమే నా సొదరి, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ మనల్ని విడిచి పోయారు. ఆ బాధ మరవకముందే.. నా ప్రియ మిత్రుడు జైట్లీ కూడా లేరనే వార్త రావడం విచారకరం’ అంటూ మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
 
జైట్లీ సేవలు చిరస్మరణీయం: కేసీఆర్‌
జైట్లీ మరణం పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘జైట్లీ మరణం తీరని లోటు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అంటూ కేసీఆర్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
 
మేధావి, స్నేహశీలి: జగన్‌
అరుణ్‌ జైట్లీ ఇకలేరనే వార్తతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘జైట్లీ మరణవార్తపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన ఓ మంచి మేధావి, స్నేహశీలి, చాలా అంశాలపై స్పష్టత కలిగిన వ్యక్తి. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేం’అని జగన్‌ ట్వీట్‌ చేశారు.

కార్పొరేట్‌ ప్రపంచం నివాళి
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల దేశ వ్యాపార వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన్ను నిజమైన సంస్కరణవాదిగా కార్పొరేట్‌ వర్గాలు కొనియాడాయి. జైట్లీ ఒక డైనమిక్‌ పార్లమెంటేరియన్‌ అని, వివిధ వర్గాలను సమన్వయం చేసుకోవడంలో ఆయన నేర్పరి అని, న్యూ ఇండియా అవతరణలో ఆయన ఆలోచనలు అత్యంత కీలకపాత్ర పోషించాయని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిత్తల్, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ కొనియాడారు. జైట్లీ మరణం దేశం పూడ్చుకోలేని లోటని వేదంతా చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్, సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌  షా, ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌సోమానీ, జేఎస్‌డబ్లు్య గ్రూప్‌ సీఎండీ సజ్జన్‌ జిందాల్‌ తదితరులు జైట్లీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.  

–సాక్షి, బిజినెస్‌ వెబ్‌ విభాగం
 

Advertisement
Advertisement