నాలుగో విడత ప్రశాంతం | Sakshi
Sakshi News home page

నాలుగో విడత ప్రశాంతం

Published Mon, Dec 15 2014 1:18 AM

నాలుగో విడత ప్రశాంతం

కశ్మీర్‌లో 49 శాతం, జార్ఖండ్‌లో 60 శాతం పోలింగ్  
కశ్మీర్‌లో గత ఎన్నికల కంటే 4% అధికం


శ్రీనగర్, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలను బహిష్కరించాలన్న వేర్పాటువాదుల పిలుపును పట్టించుకోకుండా జమ్మూకశ్మీర్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగో దశలో నాలుగు జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 49 శాతం ఓటింగ్ నమోదైంది. తీవ్ర చలిని సైతం లెక్కచేయకుండా ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చారు. గత ఎన్నికలతో పోల్చితే నాలుగు శాతం ఎక్కువ ఓటింగ్ జరిగింది. అయితే తొలి మూడు దశల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఇది తక్కువే.

తొలి రెండు దశల్లో 71 శాతం, మూడో దశలో 59 శాతం ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా, నాలుగో దశ ఎన్నికల సందర్భంగా డజను ప్రాంతాల్లో పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫోపియన్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేస్తూ బీజేపీ అభ్యర్థి జావేద్ అహ్మద్ ఖాద్రి అక్కడి కెమెరాలకు చిక్కారు. అయితే పీడీపీ, నేషనల్ కాన ్ఫరెన్స్ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే అమిరకదల్ స్థానం పరిధిలోని చనాపోరా ప్రాంతంలో పోలింగ్ అధికారిపై బీజేపీ అభ్యర్థి హీనా భట్ చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీన్ని ఆమె తోసిపుచ్చారు. కొందరు అధికారులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చనాపోరా కేంద్రం ప్రిసైడింగ్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై ఇతర పక్షాలన్నీ హీనా భట్‌ను తప్పుబట్టాయి. బీజేపీపై విమర్శలు గుప్పించాయి. కాగా, నాలుగో దశతో జమ్మూకశ్మీర్‌లోని మొత్తం 87 స్థానాలకుగాను 67 స్థానాల్లో ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో జమ్మూ ప్రాంతంలో మిగిలిన 20 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరుగుతాయి. 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక జార్ఖండ్‌లో నాలుగో దశలో 61 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు అధికసంఖ్యలో ఓటేశారు. నాలుగో దశలో 15 నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ 60 శాతం పోలింగ్ నమోదైంది.

Advertisement
Advertisement