రాజకీయాల్లో ఘనాపాటి.. గణపతిరావు | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో ఘనాపాటి.. గణపతిరావు

Published Thu, Oct 9 2014 12:28 AM

రాజకీయాల్లో ఘనాపాటి.. గణపతిరావు - Sakshi

- వృత్తిరీత్యా న్యాయవాది..ప్రవృత్తి రాజకీయం
- సాంగ్లీ నుంచి పదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక, రెండుసార్లు పరాజయం
- ప్రస్తుతం పదమూడోసారి బరిలోకి.. తన అదృష్టానికి పరీక్ష

షోలాపూర్, న్యూస్‌లైన్: పది సార్లు విజయం సాధించారు.. రెండు సార్లు పరాజయాన్ని చవిచూశారు. ఆయనే శేత్‌కార్ కాముగార్ పార్టీ నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రి 88 ఏళ్ల గణపతిరావు దేశ్‌ముఖ్. జిల్లాలోని సాంగ్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పదమూడోసారి ఎన్నికల బరిలోకి దిగారు.
 
రైతులకు అండగా..
గణపతిరావు మొహాల్ తాలుకాలోని పెన్నూర్ గ్రామానికి చెందినవాడు. వృత్తి రీత్యా న్యాయవాది కావడంతో ఆయన సాంగ్లీకి వెళ్లాడు. ఈ సమయంలోనే సాంగ్లీ తాలూకాలోని బుద్దిహాల్ చెరువు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా నిలిచారు. వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా కృషి చే శారు.
 
1972,1995 ఎన్నికలు మిన హాయిస్తే..
1972,1995 ఎన్నికలను మినహాయిస్తే,ఆయన 1962 నుంచి 10 సార్లు ఈ నియోజక వర్గంలో విజయఢంకా మోగించారు. 50 సంవత్సరాలకు పైబడి శాసన సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు పోటీగా ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఎప్పుడు తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్ట లేదు. ఆ విధంగా గణపతిరావు కూడా ఎన్‌సీపీ వెన్నంటే ఉంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు.
 
1962లో తొలి విజయం

1952, 1957 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కేశవ్‌రావుత్ సాంగ్లీ నుంచి విజయం సాధించారు. 1962లో గణపతిరావు తొలిసారిగా ఎన్నికల్లో గెలిచి ఎంఎల్‌ఏ అయ్యారు. 1967లో కాంగ్రెస్‌కు చెందిన కాకాసాహెబ్ సోలంఖేను 668 ఓట్లు తేడాలో ఓడించారు. 1972 నాటి ఎన్నికల్లో గణపతిరావుకు ఓటమి తప్పలేదు. కాకాసాహెబ్ 2,655 ఓట్ల తేడాతో ఆయన్ను ఓడించారు. కాకాసాహెబ్ మృతి   తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ గణపతిరావు విజయం సాధించారు. 1978లో ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన బాజీరావు గాటగేను 21,558 ఓట్ల తేడాతో ఓడించారు.  1978లో శరద్ పవార్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆయన వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు.

1980 ఎన్నికల్లో గణపతిరావు కాంగ్రెస్‌కు చెందిన పాండురంగ్  బాంబరేను 12,523 ఓట్ల తేడాతో ఓడించారు. 1995 నాటి ఎన్నికలు నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగాయి. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన శాహజీబాపు కేవలం 192 ఓట్ల తేడాతో గణపతిరావుపై విజయం సాధించారు. 1999 నాటి ఎన్నికల్లో గణపతిరావు తాత్కాలిక ఎంఎల్‌ఏ శాహజీబాపును 39,971 ఓట్ల తేడాతో ఓడించారు. 2004 ఎన్నికల్లో 20 వేలు అలాగే 2009లోనూ మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు.
 
ఈ సారి చిరకాల ప్రత్యర్థితో..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గణపతిరావు చిరకాల ప్రత్యర్థి శాహజీబాపు పాటిల్ ఐదోసారి బరిలో నిలిచారు. ఈ సారి శాహజీ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి శివసేన అభ్యర్థిగా తలపడుతున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ తరఫున జగదీష్ బాయిర్, బీజేపీ తర ఫున శ్రీకాంత్ దేశ్‌ముఖ్ ఎన్నికల బరిలో ఉన్నారు. పదోమూడోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement