చండీ ప్రసాద్‌భట్‌కు గాంధీశాంతి బహుమతి ప్రదానం | Sakshi
Sakshi News home page

చండీ ప్రసాద్‌భట్‌కు గాంధీశాంతి బహుమతి ప్రదానం

Published Tue, Jul 15 2014 5:32 PM

చండీ ప్రసాద్‌ భట్‌కు గాంధీశాంతి బహుమతి ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

న్యూఢిల్లీ:  ప్రముఖ పర్యావరణవేత్త చండీ ప్రసాద్‌భట్‌కు  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ప్రతిష్టాత్మక  గాంధీశాంతి బహుమతి ప్రదానం చేశారు.  గాంధీ సిద్ధాంతాల ప్రచారానికి అవిరళ కృషిచేసిన భట్‌ను 2013 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1994లో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతిపిత గౌరవార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటుచేశారు.
 గాంధీ పద్ధతులు, అహింసా సిద్ధాంతాలతో సామాజిక మార్పునకు కృషి చేసినవారికి ఈ అవార్డును అందజేస్తారు.

1934లో గఢ్వాల్‌లో ఒక రైతు కుటుంబంలో చండీ ప్రసాద్ భట్ చిప్కో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలచి, గడ్వాల్లో అంతరిచిపోతున్న అటవీ సంపదను కాపాడేందుకు నడుంబిగించారు.   బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో భట్ ఒకసారి జయప్రకాష్ నారాయణ్ ప్రసంగాన్ని విని, వెంటనే ఉద్యోగానికి స్వస్తిచెప్పి సమాజ సేవకు అంకితమయ్యారు. 1964లో ‘దశౌలి గ్రామ్ స్వరాజ్య సంఘ్’ను భట్ ఏర్పాటు చేశారు.  మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా వివిధ సహకార సంఘాలను ‘స్వరాజ్య సంఘ్’ నిర్వహించింది.

1973 ఏప్రిల్‌లో మండల్ అనే గ్రామంలో భట్ నాయకత్వంలో కొంతమంది గ్రామీణులు చెట్లను నరికివేయడాన్ని నిరోధించారు. అలా ‘చిప్కో ఆందోళన్’కు అంకురార్పణ జరిగింది. మైదాన ప్రాంతాల్లోని కర్మాగారాలకు కలపను వేలం వేయడాన్ని నిలిపివేయాలన్న డిమాండ్తో   పుట్టుకొచ్చిన  రైతు ఉద్యమం అది. మండల్ గ్రామంలో రైతుల విజయం ఆధునిక భారతీయ పర్యావరణోద్యమ సంస్థాపక సంఘటనగా చరిత్రలో నిలిచింది. ఆ తరువాత భట్ చెట్ల పెంపకం శిబిరాలను నిర్వహించారు.  కొండలపై దేశవాళీ మొక్కలను పెంచడంపై గ్రామీణులకు ప్రేరణ కల్గించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ఎటువంటి ప్రచార పటాటోపాలకు పోకుండా, నిరంతరమూ కృషి చేస్తూ వస్తున్నారు.  పర్యావరణ పరిరక్షణకు  భట్ అద్వితీయమైన కృషి చేశారు.

గతంలో గాంధీ శాంతి  బహుమతిని అందుకున్నవారు:

2005 - దక్షిణాఫ్రికా క్రైస్తవ మతాచార్యుడు డెస్మాండ్ టూటూ
2004 –  కోరెట్టా స్కాట్ కింగ్ (అమెరికా పౌర హక్కుల నాయకుడు కీర్తిశేషుడు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సతీమణి)
2003 – వక్లావ్ హావెల్ మాజీ చెకోస్లోవేకియా అధ్యక్షుడు (చెక్ రిపబ్లిక్ తొలి అధ్యక్షుడు కూడా)
2002 – భారతీయ సంస్కృతి అభివృద్ధి పై పనిచేసే భారతీయ విద్యా భవన్
2001 –  ఐరిష్ శాంతి ఉద్యమకారుడు జాన్ హుమ్.
2000 – ‘నల్ల సూరీడు’ నెల్సన్ మండేలా - గ్రామీణ్ బ్యాంకు (సంయుక్త విజేత), బంగ్లాదేశ్ కు చెందిన ముహమ్మద్ యూనుస్ ఈ బ్యాంకును స్థాపించారు.
1999 – మురళిధర్ దేవిదాస్ అమ్టే (బాబా అమ్టే)
1998 – రామకృష్ణ మిషన్,ఇండియా
1997 – డాక్టర్ గెర్హార్డ్ ఫిస్చేర్ (మాజీ జర్మన్ డిప్లోమాట్)
1996 – సామాజిక సేవకుడు డాక్టర్ ఏ.టీ.అరియరత్నే  (శ్రీలంక)
1995 – ఆఫ్రికా స్వాతంత్రోద్యమ నాయకుడు డాక్టర్ జూలియస్ కే. న్యరేరే (మాజీ టాంజానియా అధ్యక్షుడు)

 - శిసూర్య

Advertisement
Advertisement