‘బలవంతంగా శాకాహారిగా మారుస్తున్నారు’

13 Jun, 2018 14:49 IST|Sakshi

పోర్చుగీసు అధికారులకు అబూసలేం ఫిర్యాదు

ముంబై : డీ గ్యాంగ్‌ సభ్యుడు, ముంబై పేలుళ్ల కేసులో శిక్ష పడి ముంబైలోని తలోజ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేంకు చికెన్‌ కావాలని డిమాండ్‌ చేశాడు. తనకు చికెన్‌ పెట్టట్లేదని, శాకాహారిగా మార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పోర్చుగీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసిన అబూ సలేంను పరీక్షించేందుకు మంగళవారం పోర్చుగీసు నుంచి అధికారులు, వైద్యులు వచ్చారు. సలేంను జైల్లో కలిసిన సమయంలో వారితో పాటు జైలు ఐజీ, తలోజ జైలు ఎస్పీ, ఒక సీబీఐ అధికారితో పాటు, అబూ సలేం తరపున న్యాయవాది సబా ఖురేషీ కూడా ఉన్నారు.

వైద్య పరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడిన సబా ఖురేషీ.. అబూ సలేంకు ఇచ్చే ఆహారంలో నాణ్యత లేదని, అతను బలవంతంగా శాకాహారం తినాల్సివస్తుందని అన్నారు. అతను ఉన్న గదిలో సూర్యరశ్మి సరిపడా ఉండటం లేదని, ఉపయోగించే టాయిలెట్‌ చాలా చిన్నదిగా, అపరిశుభ్రంగా ఉన్న కారణంగా అతను అనారోగ్యానికి గురౌవుతున్నాడని ఆమె తెలిపారు. అబూకు మోకాలి నొప్పులు, కంటి చూపు సమస్యలు ఉన్నాయని వాటి కోసమే వైద్యులు పరీక్షించారని వెల్లడించారు. ఒక సంవత్సరకాలంగా అతనితో మాట్లాడేందుకు కొంతమంది భద్రతా సిబ్బందికి అధికారులు అనుమతి ఇచ్చారని, కానీ అతని కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా జైల్‌ ఎస్పీ సదానంద్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. అబూ సలేం కోరినట్టు తాము అతనికి చికెను ఇవ్వలేమని స్పష్టం చేశారు. వైద్యులు సూచిస్తే మాత్రం, కోడిగుడ్లను ఆహారంలో ఇస్తామని తెలిపారు. ఇతర ఖైదీలు ఉండే గదులు, అబూ సలేం ఉండే గది ఒకే తరహాలో ఉంటాయని ఆయన వెల్లడించారు. వాటిలో స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరిస్తాయని తెలిపారు. అయినా అబూ సలేం ఏదో ఒక కారణంతో అనారోగ్యం అంటూ ఫిర్యాదులు చేస్తాడని అన్నారు. అతడు చేసే ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు