రాజధానిలో 'చెత్త' రాజకీయం | Sakshi
Sakshi News home page

రాజధానిలో 'చెత్త' రాజకీయం

Published Sat, Jan 30 2016 3:07 PM

రాజధానిలో 'చెత్త' రాజకీయం - Sakshi

దేశ రాజధానిలో ఇప్పుడు చెత్త రాజకీయం రాజ్యమేలుతోంది. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఎక్కడ చూసినా భారీ ఎత్తున చెత్త పేరుకుపోతోంది. దీనికి కారణం మీరంటే మీరంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నాయకులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండగా.. బీజేపీ చేతిలో మునిసిపల్ కార్పొరేషన్ ఉంది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పాలకవర్గం రాజీనామా చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే మొత్తం ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చీపుళ్లు పట్టుకుని వీధులు తుడుస్తామని ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా అన్నారు. ప్రస్తుతం పీడబ్ల్యుడీ కార్మికులు కొంతమేరకు పారిశుధ్య పనులు నిర్వర్తిస్తున్నారు. పార్టీ వలంటీర్ల సాయం కూడా తీసుకుని చెత్తను శుభ్రం చేయిస్తామని ఆప్ వర్గాలు అంటున్నాయి. ఎక్కడైనా చెత్త పేరుకుపోతే పౌరులు కాల్ చేసేందుకు వీలుగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎంసీడీకి ఈ చెత్తను క్లియర్ చేసే సామర్థ్యం లేదని, త్వరలోనే నగరంలో పేరుకున్న చెత్తను ఎత్తేయించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తామని మిశ్రా తెలిపారు.

కాగా ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వేలాది మంది బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆప్.. పార్టీ రాజకీయాలకు పాల్పడుతోందని, కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. మూడు కార్పొరేషన్లకు రూ. 3వేల కోట్లు విడుదల చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు.

Advertisement
Advertisement