ఫుల్లుగా తాగి పోలీసులను పరుగెత్తించింది | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా తాగి పోలీసులను పరుగెత్తించింది

Published Wed, Oct 26 2016 2:53 PM

ఫుల్లుగా తాగి పోలీసులను పరుగెత్తించింది - Sakshi

న్యూఢిల్లీ: ఫుల్లుగా తాగేసిన ఓ యువతి సరదా కోసం రక్షించండి అంటూ ఫోన్ చేసి ఢిల్లీలోని దౌలా కువాన్ ప్రాంత ట్రాఫిక్ పోలీసులను పరుగులు పెట్టించింది. ఆ యువతి నిజంగానే ప్రమాదంలో ఉందని భావించిన పోలీసులు హడావుడిగా రంగంలోకి దిగడమే కాకుండా నడి రోడ్డుపై బారీకేడ్లు పెట్టి ఆమె వెళ్తున్న కారును అడ్డుకొని అందులోని ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. అయితే, వారిని ప్రశ్నించిన తర్వాత అసలు విషయం తెలిసింది.

అలా కేకలు పెట్టిన యువతి తమ మిత్రురాలు అని, పార్టీకి వెళ్లి అక్కడ మద్యం సేవించి తిరిగి వచ్చే క్రమంలో సరదా కోసమే అలా ఆమె చేసిందని వివరించారు. ఆ యువతిని కూడా అడగడం ద్వారా వారంతా స్నేహితులే అని తెలుసుకున్న పోలీసులు ఎలాంటి కేసు పెట్టకుండానే వదిలేశారు. తనను రక్షించాలని, మారుతీ కారులో దౌలా కువాన్ వైపు తీసుకెళుతున్నారని అరుస్తూ కారు నెంబర్ కూడా చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ప్రమాదం నిజం కానప్పటికీ వేగంగా స్పందించిన ఆ పోలీసులకు కమిషనర్ రివార్డులు ఇచ్చారు.

Advertisement
Advertisement