ఉద్యోగం మహిళ లక్షణం! | Sakshi
Sakshi News home page

ఉద్యోగం మహిళ లక్షణం!

Published Sun, Oct 28 2018 2:13 AM

Girls inner feeling is this across the country - Sakshi

దేశంలోని ప్రతి పది మంది కౌమార బాలికల్లో ఏడుగురు డిగ్రీ పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ఉద్యోగానికి సంబంధించి ప్రణాళికలు వేసుకున్నారు. దాదాపు ప్రతి నలుగురిలో ముగ్గురు 21 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ‘నన్హి కలి’ ప్రాజెక్టులో భాగంగా నాందీ ఫౌండేషన్‌ దేశ వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైన విషయాలివీ...

25 % అమ్మాయిలు పీజీ చేయాలనుకుంటున్నారు.12 శాతం మంది ప్రొఫెషనల్‌డిగ్రీ కోర్సు పూర్తి చేయాలనుకుంటుండగా, 27 శాతం మంది గ్రాడ్యుయేషన్‌ దాకా వెళ్తామంటున్నారు. 20 శాతం మంది 12వ తరగతి దాటిపోలేమని చెబుతున్నారు.

70 % 
మొత్తంగా చూస్తే 70 శాతం మంది కనీసం గ్రాడ్యుయేషన్‌ వరకు లేదా ఉద్యోగ ప్రవేశపరీక్ష రాసేందుకు అవసరమైనంత వరకు చదువుతామని చెబుతున్నారు. ఈ లక్ష్యం పెట్టుకున్న వారిలో 76.5 శాతం మంది 16– 19 వయసున్నవారు. కానీ 19 ఏళ్లు వచ్చేసరికి 65.5% మంది మాత్రమే చదువు కొనసాగించగలుగుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. మొత్తంగా, కౌమార దశకు చేరేటప్పటికి ప్రతి ఐదుగురిలో ఒకరు చదువుకు దూరమవుతున్నారు. 

ఉద్యోగాలు చేస్తాం.. 
ప్రతి నలుగురిలో ముగ్గురు బాలికలు ఉద్యోగాలు చేస్తామంటున్నారు. టీచింగ్‌ (33 శాతం), టైలరింగ్‌ ( 11.5 శాతం) వైద్య (10.6 శాతం) పోలీసు, సాయుధబలగాలు (8 శాతం) నర్సింగ్‌ (6 శాతం) వంటి రంగాల్లో చేరుతామని చెబుతున్నారు. ఉద్యోగం చేయాలనుకుంటున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో (72 శాతం) కంటే పట్టణ ప్రాంతాల్లో (80శాతం) ఎక్కువగా ఉన్నారు. అల్పాదాయ కుటుంబాల్లో (70 శాతం) కంటే అధికాదాయ కుటుంబాల బాలికలు (80 శాతం) కెరీర్‌ సంబంధిత లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకోగలుగుతున్నారు. కెరీర్‌పై దృష్టి పెట్టిన అమ్మాయిలు గుజరాత్‌లో అత్యంత తక్కువ (61 శాతం). సిక్కింలో వీరి శాతం (94) ఎక్కువగా ఉంది. 

61 % 
61.2 శాతం మంది గ్రామీణ కౌమార బాలికలు కనీసం డిగ్రీ అయినా చదువుతామని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వారి శాతం ఇంకా ఎక్కువే (81%). 

అప్పుడే పెళ్లా...?
బాగా చదువుకుని, ఉద్యోగాలు చేయాలనే లక్ష్యం పెట్టుకున్న అమ్మాయిలు తాము పెళ్లికి తొందరపడబోమని చెప్పడం ఈ సర్వేలో తేలిన ఆసక్తికర అంశం. 73.3 శాతం మంది 21 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునేదే లేదని చెప్పారు. 51 శాతం మంది 21–25 ఏళ్ల మధ్య, 10.2 శాతం మంది 26–30 మధ్య, 12.1 శాతం మంది 31 ఏళ్లు లేదా ఆ తర్వాత పెళ్లాడతామంటున్నారు. 20 లోపు పెళ్లి చేసుకుంటామన్న వారు 26.7 శాతం మంది మాత్రమే. 21 ఏళ్లు లేదా ఆ తర్వాత పెళ్లాడాలనుకుంటున్న అమ్మాయిలు అల్పాదాయ కుటుంబాల్లో(65.4 శాతం) కంటే అధికాదాయ కుటుంబాల్లోనే (84.8 శాతం) ఎక్కువగా ఉన్నారు. సిక్కింలో నూటికి నూరు శాతం బాలికలు పెళ్లి 21 ఏళ్ల తర్వాతేనని కరాఖండిగా చెప్పారు. బిహార్‌లో ఇలాంటి బాలికలు 54.7 శాతం మంది మాత్రమే. 
 
81 %
మెరుగైన ఆదాయ వనరులున్న కుటుంబాల్లో 81 శాతం మంది అమ్మాయిలు గ్రాడ్యుయేషన్‌ వరకు చదువు కొనసాగిస్తామని చెబుతున్నారు. తక్కువ ఆదాయమున్న కుటుంబాల్లో ఇలాంటి బాలికల శాతం 61 శాతానికి పడిపోయింది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తామని చెప్పిన బాలికల శాతం బిహార్‌లో అత్యంత తక్కువ (52 శాతం)గా ఉండగా, జమ్మూ, కశ్మీర్‌లో ఎక్కువ (90 శాతం)గా ఉంది. 

అధ్యయనం వెనుక..
భారత్‌లో మహిళా ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. 2015 నాటికి మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 23.7 శాతం మాత్రమే. సామాజిక ఆచారాలు, ఇంటిపని, నైపుణ్య లేమి వంటి అంశాలు ఇందుకు కారణాలవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరింత మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని, దీని వల్ల వ్యవస్థకు, కుటుంబాలకు పలు రకాలుగా జరిగే మేలును ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్కూలుకు వెళ్లే బాలికల్ని పదిశాతం మేరకు పెంచితే స్థూల జాతీయోత్పత్తి 3 శాతం మేర పెరుగుతుందని 2014లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ జరిపిన అధ్యయనం తేల్చింది. అమ్మాయిలు చదువుకునే కాలం పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో వారు గడించే ఆదాయమూ పెరుగుతుందని, ఈ పరిస్థితి కుటుంబాలు, కమ్యూనిటీలు పేదరికం నుంచి బయటపడేందుకు దోహదపడుతుందని యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ 2014 అధ్యయనం చెబుతోంది.  

Advertisement
Advertisement