మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి! | Sakshi
Sakshi News home page

మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!

Published Sat, May 16 2020 2:20 PM

The glue that holds our econom y: Anand Mahindra grieves migrant labourers - Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో చోటు చేసుకున్న యూపీ విషాద ఘటన, వలస  కార్మికుల దుర్మరణంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై సమాజంలో మనందరం  సిగ్గుతో తలదించుకోవాలంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి)

మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన వలస కార్మికులను మనమే మాయం చేశాం. దీనికి సమాజంలోని మనం అందరమూ బాధ్యులమే. ముఖ‍్యంగా చిన్నా పెద్దా వ్యాపారస్థులందరమూ సిగ్గు పడాలి  అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అంతేకాదు  వలస కార్మికుల సమస్యల స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించాలని మహీంద్రా  గ్రూపును కోరారు. వారికి ఎలా  సహాయపడగలమో సూచించాలన్నారు.  తద్వారా బాధిత కుటంబాలను  ఆదుకోవడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

కోవిడ్-19 కట్టడి నేపథ్యంలో దాదాపు రెండు నెలల సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని ప్రధాన పట్టణ పారిశ్రామిక కేంద్రాల నుండి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ కుటుంబాలతో కలిసి తమ సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. ఈక్రమంలో అనేకమంది అసువులు బాస్తున్నారు. మరోవైపు  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్మికుల మరణానికి సంతాపం తెలిపారు. 

కాగా ఉత్తరప్రదేశ్ ఔరయా జిల్లాలో శనివారం తెల్లవారుజామున వలస కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కును, మరో వ్యాను ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో 24 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడిన సంగతి  తెలిసిందే. 

చదవండి: భారీ డీల్‌ : ఫేస్‌బుక్‌ చేతికి ‘జిఫీ’

Advertisement
Advertisement