పంజాబ్‌లో గెలుపెవరిది? | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో గెలుపెవరిది?

Published Sat, Jan 7 2017 1:48 AM

పంజాబ్‌లో గెలుపెవరిది? - Sakshi

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. మొత్తం 117 సీట్లకు వచ్చే నెల 4న పోలింగ్‌ జరుగుతుంది. శిరోమణి అకాలీదళ్‌–బీజేపీ సంకీర్ణ సర్కారు నేతగా ప్రకాశ్‌ బాదల్‌ గత పదేళ్లుగా సీఎం పదవిలో కొనసాగుతున్నారు. పంజాబ్‌ 1980 నుంచి 15 ఏళ్లు మతతత్వం – ఉగ్రవాదంతో ఇబ్బందులు పడిం ది. ఆ తర్వాత 20 ఏళ్లు రాజకీయ సుస్థిరత సాధ్యమైంది. అయితే రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభాలు చుట్టుముట్టాయి. దాదాపు 58% సిక్కులు, 38% హిందువులున్న పంజాబ్‌ ‘కల్చర్‌’(సంస్కృతి) అగ్రికల్చర్‌–అనే రీతిలో వ్యవసాయాభివృద్ధి సాధించింది.

సాగునీటి సమస్య, పెరిగిన సాగు వ్యయం, అప్పుల బాధలతో రాష్ట్ర రైతాంగానికి ఆత్మహత్యలే దిక్కయ్యాయి. యువతలో నిరుద్యోగ సమస్య, మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 13 సీట్లలో పోటీ చేసి 4 గెలుచుకుంది. అకాలీ–బీజేపీ కూటమి, ప్రతిపక్షాలకు మరో ప్రత్యామ్నాయంగా కనిపించింది.

మేలుకున్న కాంగ్రెస్‌
తమిళనాడులా ఇక్కడా ప్రతి ఐదేళ్లకు పాలకపక్షాన్ని జనం మారుస్తారనే అతి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో  ఓడిపోయింది. అప్పుడు అకాలీదళ్‌ బలం 48 నుంచి 56 సీట్లకు పెరిగింది.  కాంగ్రెస్‌ బలం 48 నుంచి 46కు తగ్గింది. డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్‌ ప్రచార వ్యూహం ఫలించింది. గణనీయ సంఖ్యలో ఎస్సీల్లోని చమార్‌(చర్మకారులు)లు అకాలీ–బీజేపీ కూటమికి ఓటేశారు. పటియాలా మాజీ సంస్థానాధీశుని కుమారుడైన కాంగ్రెస్‌ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌కు ఇలా అనుకోని పరాజయం ఎదురైంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ‘కెప్టెన్’ కొత్త ఎత్తుగడలతో సాగుతున్నారు. బీజేపీ మాజీ ఎంపీ నవజోత్‌సింగ్‌ సిద్ధూను కాంగ్రెస్‌కు చేరువ చేస్తున్నారు. ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్‌ కిశోర్‌ మాటలను అనుసరిస్తున్నారు.

బాదల్‌ కుటుంబంపై అవినీతి మచ్చ
1997 నుంచి అధికారంలో ఉన్నప్పుడల్లా సీఎం బాదల్‌ కుటుంబం అక్రమ మార్గాల్లో అడ్డగోలుగా సంపాదిస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. మాదకద్రవ్యాల వ్యాపారం ఈ కుటుంబం మద్దతుతో సాగుతోందని ఆప్‌ నేత కేజ్రీవాల్‌ నిందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు బస్సుల్లో 60 శాతం బాదల్‌ కుటుంబ సభ్యుల ట్రాన్స్ పోర్ట్‌ కంపెనీలవే. ఇంకా మద్యం, మీడియా, హోటల్స్, ఇంధన రంగాల్లో ఈ కుటుంబానికి వ్యాపారాలున్నాయి.

కాంగ్రెస్‌కు 62 సీట్లు!
ఇండియాటుడే–యాక్సిస్‌ తాజా సర్వే.. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 56–62, ఆప్‌కు 36–41 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అకాలీ–బీజేపీ కూటమి 18–22 సీట్లతో కుదేలవుతుందని పేర్కొంది.  రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో 3, దేశంలో 44 లోక్‌సభ సీట్లే సాధించి పరువు కోల్పోయిన కాంగ్రెస్‌ పంజాబ్‌లో గెలిస్తే పార్టీ పునరుత్తేజానికి దారులు పడతాయి.

Advertisement
Advertisement