మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన బంగారం ధర | Sakshi
Sakshi News home page

మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన బంగారం ధర

Published Thu, Nov 6 2014 3:44 AM

మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన బంగారం ధర - Sakshi

 ముంబై/హైదరాబాద్: బంగారం ధర మళ్లీ తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర తగ్గడంతో మన దేశంలో కూడా ధర పడిపోయింది. ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయలకు పైగా పతనమై 25,460 వద్ద అమ్మకం జరిగింది. గడిచిన నెల రోజులుగా బంగారం ధర దాదాపు 3 వేల రూపాయల వరకు తగ్గింది. ఢిల్లీలో బంగారం ధర మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఢిల్లీలో 25వేల 900 రూపాయల వద్ద అమ్మకం జరిగింది.

 దేశీయంగా ప్రముఖ స్పాట్ బులియన్ మార్కెట్ ముంబైలో పసిడి ధరలు బుధవారం 16 నెలల కనిష్ట స్థాయికి పడ్డాయి. 24 క్యారెట్లు 10 గ్రాములు మంగళవారం ముగింపుతో పోల్చితే, రూ.505 తగ్గి, రూ.25,600కు దిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 తగ్గి రూ.25,455కు పడింది. డాలర్ బలంగా ఉండడం, అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ధోరణి దేశీయంగా బంగారం రేట్ల తగ్గుదలకు కారణమవుతోంది.

హైదరాబాద్‌సహా దేశీయంగా పలు బులియన్ స్పాట్ మార్కెట్లలోనూ బంగారం ధరలు బుధవారం భారీగా పడ్డాయి. వెండిది సైతం ఇదే ధోరణిగా ఉంది. ఈ మెటల్ ధర ముంబైలో కేజీకి మంగళవారం ధరతో పోల్చితే రూ.1,440 తగ్గి, రూ. 35,360గా నమోదయ్యింది. 4 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయికి వెండి ధర ఇంతవరకూ తగ్గలేదు.
 
 ఫ్యూచర్స్‌లో ఇలా...
 
 ఇదిలావుండగా అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పడిసి కాంట్రాక్ట్ ధర కడపటి సమాచారం అందే సరికి నష్టాల్లోనే ఉంది. 31.1 గ్రాముల ధర (ఔన్స్) క్రితం ముగింపుతో పోల్చితే 21 డాలర్లు తగ్గి (2శాతం) 1,147 డాలర్లుగా ఉంది. ఇక వెండి ధర సైతం 2.73 శాతం తగ్గి, 15 డాలర్ల స్థాయిలో ఉంది. దేశీయంగా బంగారం, వెండి ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ క్షీణించాయి. 10 గ్రాముల కాంట్రాక్ట్ పసిడి ధర 1.5 శాతం (రూ.371 ) తగ్గి, రూ.25,592 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర భారీగా రూ. 923 తగ్గి (2.6 శాతం) రూ.34,572 వద్ద ట్రేడవుతోంది.
**

Advertisement
Advertisement