గోరఖ్‌పూర్‌ ఉదంతం.. ఆ డాక్టర్‌ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

గోరఖ్‌పూర్‌ ఉదంతం.. ఆ డాక్టర్‌ అరెస్ట్

Published Sat, Sep 2 2017 9:13 AM

గోరఖ్‌పూర్‌ ఉదంతం.. ఆ డాక్టర్‌ అరెస్ట్

సాక్షి, గోరఖ్‌పూర్‌: ఉత్తర ప్రదేశ్ లో బాబా రాఘవ దాస్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన ఉదంతంలో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వైద్యుడు డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సిలిండర్ల కొరతకు ప్రధాన కారణం కఫీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. 
 
మెదడువాపు వ్యాధి విభాగాన్ని నోడల్ అధికారిగా ఉన్న కఫీల్‌ ఖాన్‌, డెంటిస్ట్ అయిన భార్యతో కలిసి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రి కోసం బీఆర్డీ ఆస్పత్రి నుంచే సిలిండర్లను తరలించాడని, తద్వారా సిలిండర్ల కొరత ఏర్పడి పిల్లల మరణాలు సంభవించాయని ఆరోపణలు వినిపించాయి. ఇందుకు ఘటన జరిగిన సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్‌ అయిన డాక్టర్‌ ఆర్కే మిశ్రా కూడా సహకరించాడని విచారణలో తేలింది. 
  
సొంత డబ్బులతో పిల్లల కోసం సిలిండర్లు కొంటున్నట్లు కలరింగ్‌ ఇచ్చి ‘హీరో’గా మీడియాకెక్కిన కఫీల్ తర్వాత అసలు విషయం వెలుగు చూడగా సస్పెన్షన్‌ కు గురికావటంతోపాటు ఇప్పుడు జైలు పాలయ్యారు.

Advertisement
Advertisement