పెద్దల సభలో సర్కారుకు సంకటం | Sakshi
Sakshi News home page

పెద్దల సభలో సర్కారుకు సంకటం

Published Wed, Mar 4 2015 12:46 AM

government get into confusion in rajyasabha

 రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపక్షం సవరణ తీర్మానం ఆమోదం
     అవినీతి నిర్మూలన, ‘నల్లధనం’పై సర్కారు వైఫల్యాల ప్రస్తావన ప్రసంగంలో లేదంటూ సీపీఎం సవరణ తీర్మానం
     ఉపసంహరించాలని వెంకయ్య విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం
     రాజ్యసభ చరిత్రలో ఈ తరహా తీర్మానానికి ఆమోదం ఇది నాలుగోసారి
 న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారుకు రాజ్యసభలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి.. అవినీతి, నల్లధనం అంశాలపై ప్రతిపక్షాలు ఒక సవరణ తీర్మానం చేయగా.. అది ఆమోదం పొందటంతో సర్కారు సంకటంలో పడింది. ఉన్నతస్థాయిలో అవినీతిని అణచివేయటంలో, నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి ఈ ప్రసంగంలో ప్రస్తావించలేదు అని పేర్కొంటున్న సవరణ తీర్మానాన్ని సీపీఎం సభ్యులు సీతారాం ఏచూరి, పి.రాజీవిలు ప్రవేశపెట్టారు. దానిని ఉపసంహరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ప్రసంగంలో నల్లధనం గురించిన ప్రస్తావన ఉందంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏచూరి ఆందోళనను నమోదు చేయటం జరిగిందని.. కాబట్టి తీర్మానాన్ని ఉపసంహరించాలని ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఏచూరి స్పందిస్తూ.. మామూలుగా అయితే అటువంటి విజ్ఞప్తిని తాను అంగీకరించేవాడినని.. కానీ 14 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత కూడా ప్రధానమంత్రి సమాధానంపై స్పష్టత కోరే అవకాశాన్ని విపక్షానికి ఇవ్వకుండా తిరస్కరించటంతో ప్రభుత్వం తమకు మరో అవకాశం లేకుండా చేసిందని పేర్కొన్నారు. ప్రధాని గంట సేపు మాట్లాడుతూ సమాధానం ఇచ్చిన వెంటనే సభ నుంచి వెళ్లిపోవటం పట్ల కూడా ఏచూరి అభ్యంతరం వ్యక్తంచేశారు. అనంతరం డివిజన్ ఆఫ్ ఓటింగ్ నిర్వహించగా సవరణ తీర్మానం సభ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్షం ఇచ్చిన సవరణ తీర్మానం ఆమోదం పొందటం రాజ్యసభ చరిత్రలో ఇది నాలుగో సారి. ఇంతకుముందు జనతా పార్టీ పాలనలో 1980 జనవరి 30న, వి.పి.సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ హయాంలో 1989 డిసెంబరు 29న, 2001 మార్చి 12న వాజపేయి సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కారు అధికారంలో ఉన్నపుడు ఇటువంటి తీర్మానాలు రాజ్యసభలో ఆమోదం పొందాయి. కాగా, తాజా సవరణ తీర్మానం వల్ల రాజ్యసభలో అధికార పక్షానికి బలం లేదని గుర్తు చేయడం తప్ప తమకే ఇబ్బందీ లేదని వెంకయ్య అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement