లోక్‌సభలో 'భూ'బిల్లు | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో 'భూ'బిల్లు

Published Tue, May 12 2015 1:35 AM

లోక్‌సభలో 'భూ'బిల్లు

  •     నినాదాలు.. వాకౌట్ల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  •      రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న విపక్షాలు
  •      జాయింట్ పార్లమెంటరీ ప్యానెల్ కు బిల్లు
  •      30 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు!
  •  న్యూడిల్లీ: నిరసనలు.. నినాదాలు.. వాకౌట్ల మధ్య కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద భూసేకరణ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్, తృణమూల్, బిజూ జనతాదళ్, వామపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ స్పీకర్ సుమిత్రామహాజన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారు. ఇదే బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదన్న ప్రతిపక్షాల వాదనను స్పీకర్ తిరస్కరించారు. ఒకే విషయంపై లోక్‌సభలో ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లును తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టకూడదన్న నియమం ఏదీ లేదని మహాజన్ రూలింగ్ ఇవ్వటంతో విపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. అంతేకాదు.. పెండింగ్‌లో ఉన్న ఓ బిల్లును తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి సభ ఓటింగ్ సరిపోతుందని స్పీకర్ అన్నారు. బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓటింగ్ ప్రకటించగానే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, వామపక్షాలకు చెందిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో మెజారిటీ ఉండటంతో బిల్లును ప్రవేశపెట్టడానికి ఓటింగ్ సహజంగానే అనుకూలంగా వచ్చింది. ఆ వెంటనే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ సరైన పరిహారాన్ని పొందే హక్కు, భూసేకరణలో పారదర్శకత, పునరావాస రెండో బిల్లు-2015 ను ప్రవేశపెట్టారు.


     జాయింట్ కమిటీకి భూ బిల్లు: భూసేకరణ బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీకి నివేదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపాలని నిర్ణయించింది. మంగళవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ నేతృత్వంలో ఉభయ సభల్లోని మొత్తం 30 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఓ తీర్మానాన్ని లోక్‌సభలో మంగళవారం ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ సంయుక్త కమిటీకి బీజేపీ నేత ఎస్‌ఎస్ అహ్లూవాలియా నేతృత్వం వహించే అవకాశం ఉంది. జీఎస్టీ బిల్లుపై కూడా ప్రభుత్వం అంగీకరించిన మేరకు 15 నుంచి 21 మందితో సెలెక్ట్ కమిటీని నియమిస్తారు. ఈ బిల్లుకు అన్నాడీఎంకే ఒక్కటే వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ జీఎస్టీ బిల్లు యూపీఏ మానసపుత్రిక కాబట్టి వర్షాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదానికి సహకరిస్తామని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. రెండింట మూడు వంతుల మెజార్టీతో ఆమోదించిన తరువాత దీనిపై 29 రాష్ట్రాలు తమ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.  


     నల్లధనం బిల్లుకు ఆమోదం: నల్లధనంపై ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ బిల్లును ప్రవేశపెడుతూ, ఇప్పటిదాకా ప్రభుత్వానికి తెలియజేయకుండా ఉంచిన ఆదాయ వివరాలను పొందుపరచటానికి రెండు నెలల కాలావధితో ఒక వెసులుబాటును ఏర్పాటు చేస్తామని, ఈ వెసులుబాటును వినియోగించుకుని ఆదాయ వివరాలు తెలియజేసిన వారు ఆరు నెలల వ్యవధిలో 30 శాతం జరిమానా, 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలు తెలియజేయని వారిపై 90 శాతం జరిమానా, 30 శాతం పన్నుతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. కాగా దేశంలో నల్లధనాన్ని నియంత్రించేందుకు త్వరలోనే బినామీ బిల్లును తీసుకురానున్నట్లు జైట్లీ సభకు తెలియజేశారు. 2011 ప్రజావేగు పరిరక్షణ చట్ట సవరణ బిల్లును కూడా ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

Advertisement
Advertisement