జీఎస్టీకి నేటితో రెండేళ్లు

1 Jul, 2019 03:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానం అమలుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉత్సవాలు జరపనుంది. దీంతోపాటు రిటర్నుల దాఖలుకు కొత్త పద్ధతిని, సింగిల్‌ రీఫండ్‌ వ్యవస్థ వంటి అదనపు సంస్కరణలు చేపట్టనుంది. జీఎస్టీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో నేడు జరిగే కార్యక్రమంలో వివిధ శాఖలఉన్నతాధికారులు పాల్గొననున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం సహజ్‌ సులభ్‌ రిటర్ను దాఖలు విధానం అమలు కానుంది. జూలై ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఈ విధానం అక్టోబర్‌ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుందని పేర్కొంది. వస్తు సరఫరాదారులకు ప్రవేశ పరిమితిని రూ.40 లక్షల వరకు ఇచ్చే  వెసులుబాటును రాష్ట్రాలకు కల్పిస్తున్నట్లు తెలిపింది. వార్షిక టర్నోవర్‌ రూ.50 లక్షలున్న స్మాల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు 6 శాతం పన్ను రేటుతో కాంపొజిషన్‌ స్కీం ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. 2017 జూలై ఒకటో తేదీ నుంచి అమలవుతున్న జీఎస్టీ విధానంలో కేంద్రం గత రెండేళ్లలో పలు మార్పులు చేర్పులు చేపట్టింది.

మరిన్ని వార్తలు