ఇక ప్లాస్టిక్‌ నోట్లు | Sakshi
Sakshi News home page

ఇక ప్లాస్టిక్‌ నోట్లు

Published Sat, Dec 10 2016 2:08 AM

ఇక ప్లాస్టిక్‌ నోట్లు

ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఒకవైపు పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో గందరగోళం కొనసాగుతుండగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై ప్లాస్టిక్‌ కరెన్సీ ముద్రించాలని నిర్ణయించి నట్లు శుక్రవారం పార్లమెంట్‌లో తెలిపింది. కరెన్సీ నోట్లను ప్లాస్టిక్‌ లేదా పాలిమర్స్‌తో ముద్రించాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జన్ రామ్‌ మేఘ్వాల్‌ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పేపర్‌ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్‌ కరెన్సీ ప్రవేశపెట్టాలని కొన్నాళ్ల క్రితం రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రతిపాదించింది. పది రూపాయల విలువ గల వందకోట్ల ప్లాస్టిక్‌ నోట్లను ప్రయోగాత్మకంగా దేశంలోని భౌగోళిక వైవిధ్యం గల కొచ్చి, మైసూర్, భువనేశ్వర్, జైపూ ర్, సిమ్లా నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు 2014లో ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపిందని, దానికి కొనసాగింపు ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

మేఘ్వాల్‌ మరోప్రశ్నకు సమాధానమిస్తూ 2015 డిసెంబర్‌లో ఎటువంటి సెక్యూరిటీ త్రెడ్‌ లేని వెయ్యి రూపాయల నోట్లు కొన్ని తమకు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపిందని, ఇవి నాసిక్‌లోని కరెన్సీ ముద్రణా కేంద్రం నుంచి వచ్చాయని, హోసంగాబాద్‌లోని సెక్యూరిటీ పేపర్‌ మిల్‌ సరఫరా చేసిన పేపర్‌పై ఈ నోట్లు ముద్రించినట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచామని మంత్రి పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ నోట్ల జీవితకాలం ఐదేళ్లవరకూ ఉంటుంది. వీటికి నకిలీలు తయారుచేయడం కూడా చాలా కష్టం. అదీగాక పేపర్‌ కరెన్సీ కంటే ప్లాస్టిక్‌ నోట్లు పరిశుభ్రంగా ఉంటాయి. నకిలీ నోట్ల బారినుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్‌ నోట్లను తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది.

Advertisement
Advertisement