50 లక్షలకు మించితేనే సుప్రీంకు

2 Jul, 2018 04:38 IST|Sakshi

ఆర్థిక సంబంధ కేసుల్లో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: తాను పార్టీగా ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల కంటే తక్కువ మొత్తం చెల్లించాల్సిన ఆర్థిక సంబంధమైన కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించ కూడదని భావిస్తోంది. ప్రస్తుతం ఈ మొత్తం రూ. 10 లక్షలుగా ఉంది. దీనిని ఐదు రెట్లు పెంచడం ద్వారా తనకు వ్యతిరేకంగా ఉన్న కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది.

ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం కలిగిన కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు రూ.50 లక్షలకు మించిన కేసుల్లోనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాయని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రకమైన కేసులు ఎక్కువగా ఆదాయపు పన్ను శాఖ, తపాలా విభాగం, రక్షణ, రైల్వే శాఖల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2017 జూన్‌ 12 నాటికి మొత్తం 1,35,060 ప్రభుత్వ కేసులు, 369 కోర్టు ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వీస్‌కు సంబంధించిన అంశాలు, ప్రైవేటు పార్టీలతో వివాదాలు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఈ వివాదాలు నడుస్తున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు