Sakshi News home page

శిష్యురాళ్ల హాస్టల్‌కు సొరంగ మార్గం

Published Sun, Sep 10 2017 3:12 AM

శిష్యురాళ్ల హాస్టల్‌కు సొరంగ మార్గం

రహస్యంగా ఏర్పాటు చేసుకున్న గుర్మీత్‌ బాబా 
హింసకు ప్రేరేపించిన ఇద్దరు అరెస్టు  


చండీగఢ్‌: హరియాణాలోని డేరా సచ్చా సౌదా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తన నివాసం నుంచి శిష్యురాళ్ల వసతి గృహం వద్దకు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గం శనివారం వెలుగులోకి వచ్చింది. ఫైబర్‌ గ్లాస్‌తో నిర్మించిన, బాబా నివాసం నుంచి ఐదు కిలోమీటర్ల పొడవున్న మరో సొరంగాన్ని కూడా అధికారులు గుర్తించారు. పంచకులలో 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ డేరాలో పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాలతో అధికారులు సోదాలు  చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్రమ టపాసుల తయారీ కేంద్రం, ఏకే–47 తుపాకీ బుల్లెట్ల ఖాళీ డబ్బాలను అధికారులు గుర్తించారు.

84 డబ్బాల టపాసులు, టపాకాయల తయారీకి వాడే రసాయనాలు తదితరాలను అధికారులు కొనుగొన్నారు. రిజిస్ట్రేషన్‌ కాని ఓ విలాసవంతమైన కారు, కొన్ని పాత రూ.500, రూ.1,000 నోట్లను కూడా అధికారులు సోదాల్లో గుర్తించారు. కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లు, పేరు ముద్రించని కొన్ని ఔషధాలను స్వాధీనం చేసుకుని కొన్ని గదులను సీజ్‌ చేశారు. డేరా ప్రధాన కేంద్రానికి వచ్చే రోడ్లపై కర్ఫ్యూ కొనసాగుతోంది. గుర్మీత్‌ను ఆగస్టు 25న సీబీఐ కోర్టు అత్యాచార కేసులో దోషిగా తేల్చింది. గుర్మీత్‌ మద్దతుదారులను హింసకు పురిగొల్పినందుకుగాను డేరా ఇన్‌చార్జ్‌ చామ్‌కౌర్, మరో కీలక డేరా అధికారి దాన్‌ సింగ్‌లను అరెస్టు చేశామని పంచకుల డీసీపీ చెప్పారు.

Advertisement
Advertisement