ఉద్యోగం కోసం.. మతం మారిపోయారు! | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం.. మతం మారిపోయారు!

Published Fri, May 26 2017 2:43 PM

ఉద్యోగం కోసం.. మతం మారిపోయారు!

వాళ్లంతా హరియాణాలో పుట్టారు. కానీ ఎలాగోలా ఆర్మీలో చేరాలనుకున్నారు. అందుకోసం తమ మతాన్ని మార్చిచూపించి, తాము సిక్కులమని నమ్మబలికి సిక్కు రెజిమెంటులో చేరే ప్రయత్నం చేశారు. కానీ.. ఆర్మీ రిక్రూట్మెంటులో ఉండే అధికారులు వాళ్ల తీరు చూసి అనుమానించారు. సరిగ్గా నాలుగు పంజాబీ పదాలు కూడా పలకలేకపోతుండటం చూసి, అసలు మీరు పంజాబీలేనా, సిక్కులేనా అని గట్టిగా నిలదీశారు. పైపెచ్చు వాళ్ల పేర్లు కూడా హిందువుల పేర్లలాగే ఉన్నాయి. దాంతో సింపుల్గా వాళ్లను పక్కన పెట్టేశారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. గత రెండేళ్లలో ఏకంగా 51 మంది హరియాణా నుంచి వచ్చిన యువకులు తాము సిక్కులమంటూ అబద్ధాలు చెప్పి ఆర్మీలో చేరే ప్రయత్నం చేయగా వాళ్లపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తమకు జీవనోపాధి కావాలంటే ఆర్మీలో చేరడం ఒక్కటే మార్గమని హరియాణా యువత నమ్మడమే ఇందుకు ప్రధాన కారణం. చాలా సందర్భాల్లో సిక్కు రెజిమెంటల్ సెంటర్లలో శిక్షణ ఇచ్చే సమయంలో వీళ్లు దొరికిపోతున్నారు. తమ కులధ్రువీకరణ పత్రాలలో దొంగతనంగా 'సిక్కు' అని మార్చేసి తీసుకొస్తున్నారు. మరికొందరైతే గురుద్వారాలో 'అమృతం' తీసుకోవడం ద్వారా సిక్కుమతంలో చేరుతున్నారు. అయితే, ఆర్మీలోకి ఎంపికైన తర్వాతే ఈ పని చేస్తున్నారు. తద్వారా ఎలాగోలా ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

బ్రిటిష్ కాలం నుంచి భారత సైన్యంలో ఇలా కులాలు, మతాల ఆధారంగా ప్రత్యేక రెజిమెంట్లు కొన్ని ఉన్నాయి. కానీ అలా మతం పేరు తప్పు చెప్పి సైన్యంలోకి వస్తున్నవాళ్లలో కొందరు ఆ మతానికి సంబంధించిన ఆచారాలను పాటించడంలో విఫలం అవుతున్నారు. ఆర్మీలోకి ఎంపికైన తర్వాత తాము గురుద్వారాలో మతం మార్చుకున్నామని చెబుతున్నారు. అయితే ఇలా వస్తున్నవాళ్లను గుర్తించిన సమయంలో అధికారులు వాళ్ల ఉద్యోగాలు తీసేయడమే కాక.. క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నారు.

ఎంపిక సమయంలో ఇలాంటి అభ్యర్థులను గుర్తించడం చాలా కష్టమని, వాళ్ల పత్రాలలో ఏవైనా తప్పులు స్పష్టంగా కనిపిస్తే తప్ప గుర్తించలేమని కల్నల్ విక్రమ్ సింగ్ శంఖ్లా అన్నారు. ఇటీవల హరియాణాలోని కైతల్ నుంచి వచ్చిన నలుగురు యువకులను గుర్తించి సిక్కు రెజిమెంటు నుంచి తొలగించామని చెప్పారు. ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగిన ప్రతిసారీ ఇలాంటి అభ్యర్థులు కనిపిస్తూనే ఉంటారన్నారు. 2015 డిసెంబర్ నెలలో హిసార్, జింద్, ఫతేహాబాద్, సిర్సా ప్రాంతాలకు చెందిన 47 మంది యువకులపై కేసులు పెట్టారు. మరో ఉద్యోగం దొరికే అవకాశం లేకపోవడం వల్లే తాము ఇలా చేయాల్సి వస్తోందని హరియాణా యువకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement