Sakshi News home page

భారత్‌లోనూ భారీ విధ్వంసం

Published Sun, Apr 26 2015 3:48 AM

భారత్‌లోనూ భారీ విధ్వంసం

* భూకంపం ధాటికి దేశవ్యాప్తంగా 51 మంది మృతి;
* 237మందికి పైగా గాయాలు
* బిహార్లో 38 మంది, యూపీలో 11 మంది, పశ్చి
మబెంగాల్‌లో ఇద్దరు మృత్యువాత
* యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు; స్వయంగా సమీక్షించిన ప్రధాని
* నేపాల్‌కు భారత్ తక్షణ సాయం; ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, సామగ్రితో బయల్దేరిన 4 విమానాలు
* నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం పంపేందుకు ప్రయత్నాలు

 
న్యూఢిల్లీ: పొరుగుదేశం నేపాల్‌లో దారుణ విధ్వంసం సృష్టించిన తీవ్ర భూకంపం భారత్‌ను కూడా కుదిపేసింది. ముఖ్యంగా నేపాల్ సరిహద్దు రాష్ట్రమైన బిహార్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో భూకంపం వల్ల ఇళ్లు, గోడలు కూలిన ఘటనల్లో 23 మంది మరణించగా, 48 మంది గాయాలపాలయ్యారు. ఉత్తర, తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు సహా పలు ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో శనివారం నేపాల్‌ను దాదాపు నేలమట్టం చేసిన భూకంపం ప్రభావం కఠ్మాండుకు  1,100 కిమీల దూరంలో ఉన్న భారతదేశ రాజధాని ఢిల్లీలోనూ కనిపించింది. మొత్తంమీద భూకంపం ధాటికి భారత్‌లో 38 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. వాటిని ప్రధాని మోదీ స్వయంగా సమీక్షించారు.
 
 భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్ అధ్యక్షుడు రాం బరన్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలకు ఫోన్ చేసి భారత్ తరఫున తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం, భారత్‌లోని ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. నేపాల్‌కు, దేశంలోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే రక్షణ, సహాయ సిబ్బందిని.. పునరావాస సామగ్రిని పంపించాలని ఆదేశించారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పర్యాటకులను సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం రాత్రి సీ 130 విమానంలో దాదాపు 250 మంది భారతీయులు ఇండియా చేరుకున్నారు.
 
 తక్షణం స్పందించిన భారత్

 నేపాల్‌లో జరిగిన భూ విలయంపై భారత్ తక్షణం స్పందించింది. ఒక సీ 130 విమానం సహా నాలుగు విమానాల్లో  సహాయ సామగ్రిని, జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన(ఎన్‌డీఆర్‌ఎఫ్)  రక్షక సిబ్బందిని కఠ్మాండుకు తరలించింది. భారత్‌లోని నేపాల్ దేశీయుల కోసం విదేశాంగ శాఖ ఒక 24 గంటలపాటు పనిచేసే ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ.. భూకంపం సృష్టించిన విధ్వంసం, నేపాల్‌కు అందిస్తున్న సాయం, భారత్‌లోని ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టిన సహాయక చర్యలు.. తదితరాలపై సమీక్షించారు. నేపాల్ అభ్యర్థనపై కొన్ని ఇంజినీరింగ్ బృందాలను, వైద్య బృందాలను, మొబైల్ ఆసుపత్రులను పంపిస్తున్నామని విదేశాంగశాఖ కార్యదర్శి జైశంకర్ తెలిపారు.

నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు అక్కడి ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఖట్మండూ నుంచి భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలకు చెందిన విమానాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన సహాయమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. కఠ్మాండులోని ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ని ప్రస్తుతం మూసేశారని, దాన్ని పునఃప్రారంభించగానే కఠ్మాండుకు విమాన సేవలు మొదలవుతాయని చెప్పారు. కఠ్మాండు విమానాశ్రయం మూతపడటంతో కఠ్మాండు వెళ్లాల్సిన అన్ని అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి, కఠ్మాండుకు దగ్గర్లోని విమానాశ్రయాలకు మళ్లిస్తున్నామన్నారు. భారత్ స్పందనపై నేపాల్ కృతజ‘తలు తెలిపింది.
 
 నేపాల్‌నుంచి 55 మంది భారత్‌కు
 భారతీయ వైమానిక దళానికి చెందిన సీ 130 జే విమానం శనివారం రాత్రి నేపాల్ నుంచి55 మంది భారతీయులను ఢిల్లీకి చేర్చింది. వారిలో నలుగురు చిన్నారులున్నారు. భారత్ నుంచి జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందిని, సహాయ సామాగ్రిని నేపాల్‌కు పంపించి, అక్కడ చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకురావడం కోసం ఈ విమానంతో పాటు మరో రెండు ఐఏఎఫ్ విమానాలను(ఐఎల్ 76, సీ 17) ఖట్మాండూ పంపించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. భారత్ నుంచి శనివారం మధ్యాహ్నం కఠ్మాండు వెళ్లిన ఐఎల్ 76లో 153 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 28 టన్నుల సహాయ సామగ్రిని పంపించగా, సీ17లో 96 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 15 టన్నుల సహాయ సామగ్రిని పంపించారు. ఈ రెండు విమానాలు కూడా నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులతో ఆదివారం ఉదయం వరకు ఢిల్లీ చేరుకునే అవకాశముంది.
 
 ప్రముఖుల ప్రార్థనలు
 నేపాల్‌కు అన్ని విధాలుగా సాధ్యమైనంత సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. భూకంపం వల్ల సంభవించిన ఆస్తి,ప్రాణ నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. భూకంపంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప బాధితుల కోసం ప్రార్థించానని సోనియా తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం అత్యంత కనిష్టంగా ఉండాలని భావిస్తున్నానన్నారు. భూకంపం బారిన పడిన నేపాల్, భారత్‌లకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు.
 
 సిక్కింలో విరిగిపడ్డ కొండ చరియలు
 తమిళనాడు, పుదుచ్చేరీ తమిళనాడు, పుదుచ్చేరీల్లో శనివారం స్వల్పంగా భూమి కంపించింది. సరిగ్గా ఉదయం 11.45 గంటల సమయంలో చెన్నై నగరంలోని కోడంబాక్కంలో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో భూకంపంగా గుర్తించి ప్రజలు బైటకు పరుగులు తీశారు. వడపళని, మైలాపూర్, అంబత్తూరు గిండిలో ఎక్కువగా నివాస ప్రాంతాలు కావడంతో అపార్టుమెంట్లలో నివసించే కుటుంబాలు బయటకు పరుగులు పెట్టారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.
 
 బిహార్
 నిన్నటివరకు వరదలు, తాజాగా భూకంపం బిహార్‌ను అతలాకుతలం చేశాయి. ఈ నేపాల్ సరిహద్దు రాష్ట్రంలో భూకంపం విధ్వంసానికి తూర్పు చంపారన్ జిల్లాలో ఆరుగురు, సీతామర్హిలో నలుగురు, దర్భంగ జిల్లాలో ఇద్దరు సహా మొత్తం 23 మంది బలయ్యారు.
 
 పశ్చిమబెంగాల్
 పశ్చిమబెంగాల్‌లో ముగ్గురు చనిపోగా, 43 మంది పాఠశాల విద్యార్థులు సహా 69 మంది గాయాలపాలయ్యారు. పశ్చిమబెంగాల్‌కు సంబంధించి డార్జిలింగ్‌లో ఇద్దరు, జల్‌పైగురిలో ఒకరు చనిపోయారు చనిపోగా, మాల్దా జిల్లాలో భవనాలు కూలిన  69 మంది గాయపడ్డారు.
 
 ఉత్తరప్రదేశ్
 భూకంపం వల్ల ఉత్తరప్రదేశ్‌లో 12 మంది చనిపోయారు. డజనుమందికి పైగా గాయపడ్డారు. బారాబంకి జిల్లాలో ముగ్గురు, గోరఖ్‌పూర్‌లో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు, సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఒకరు మరణించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement