పదివేల కుటుంబాలకు హార్వీ పరేషాన్‌ | Sakshi
Sakshi News home page

పదివేల కుటుంబాలకు హార్వీ పరేషాన్‌

Published Thu, Aug 31 2017 3:21 PM

పదివేల కుటుంబాలకు హార్వీ పరేషాన్‌

హౌస్టన్‌: అమెరికాలోని హూస్టన్‌ను అతలాకుతలం చేసిన హరికేన్‌ హార్వీ అక్కడి తెలుగు వారికీ తీరని విషాదం మిగిల్చింది. హూస్టన్‌ ప్రాంతంలో పలు తెలుగు కుటుంబాలు నివసిస్తుండగా, వారి ఇళ్లు దెబ్బతినడం ఇతరత్రా పెద్దమొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రేటర్‌ హూస్టన్‌ పరిథిలో తెలుగు కుటుంబాలకు హార్వీతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ తరహా ప్రకృతి వైపరీత్యాలకు బీమా కవరేజ్‌ వర్తించకపోవడం వారిలో ఆందోళన రేకెత్తిస్తున్నది. హరికేన్‌ ప్రభావానికి గురైన బాధిత కుటుంబానికి రూ 30 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లివచయ్చని భావిస్తున్నారు.మరోవైపు పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలో వారంతా బిక్కుబిక్కుమంటున్నారు.
 
భారీ విలయం సంభవించిన క్రమం‍లో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే అవకాశం ఉన్నా ఇతమిద్దంగా దానిపై ఎవరూ హామీ ఇచ్చే పరిస్థితి లేదు.హార్వీ ఎఫెక్ట్‌ ఉన్న గ్రేటర్‌ హౌస్టన్‌ పరిథిలోని కాటీ, సుగర్‌ ల్యాండ్‌, సైప్రస్‌, బెలైరె ప్రాంతాల్లో 50,000 జనాభాతో పదివేల తెలుగు కుటుంబాలున్నాయి. వీరిలో చాలావరకూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, వైద్య వృత్తిలో ఉన్నవారే అధికం. వీరు తమ ఇళ్లు పునర్‌నిర్మించుకోవాలంటే రుణాలపై ఆధారపడాల్సిందే. ఇక ఉన్నత విద్య ముగించి ఉద్యోగాల కోసం అన్వేషించేవారి పరిస్థితి మరింత దయనీయం.
 
విద్యార్థులూ ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తుపాన్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని తెలుగువారు షెల్టర్‌ హోమ్స్‌లో తలదాచుకున్నారు. హార్వీ ప్రకంపనలతో అక్కడ తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి కుటుంబీకులు ఇక్కడ వారి గురించి ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement