నేను కూడా కెప్టెన్‌నే: చీఫ్ జస్టిస్ | Sakshi
Sakshi News home page

నేను కూడా కెప్టెన్‌నే: చీఫ్ జస్టిస్

Published Fri, Oct 7 2016 9:19 AM

నేను కూడా కెప్టెన్‌నే: చీఫ్ జస్టిస్ - Sakshi

సుప్రీంకోర్టు క్రికెట్ జట్టుకు తాను కూడా కెప్టెన్‌నేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. అనురాగ్ ఠాకూర్‌కు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండేందుకు అర్హతలు ఉన్నాయంటూ చెప్పుకోడానికి బీసీసీఐ ప్రయత్నించినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ ఆఫీసు బేరర్లుగా ఉండాలంటే అర్హత ఏంటని ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత అధ్యక్షుడు రాజకీయ నాయకుడా అని నిలదీసింది. దీనికి బీసీసీఐ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమాధానమిస్తూ.. ఠాకూర్ కూడా క్రికెటరేనని చెప్పారు. దాంతో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న గోపాల్ సుబ్రమణియం లేచి.. మనమంతా క్రికెట్ ఆడినవాళ్లమే కదా అన్నారు. దానికి సిబల్ అభ్యంతరం వ్యక్తం చేసి, ఠాకూర్ సీరియస్ క్రికెటర్ అని చెప్పారు.

ఆ సమయంలోనే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. తాను సుప్రీంకోర్టు జడ్జీలకు కెప్టెన్ అని చెప్పారు. అయితే, అనురాగ్ ఠాకూర్ గతంలో రంజీ ట్రోఫీలో ఆడారని, హిమాచల్ ప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారని తెలిపారు. అయితే, ఆతర్వాత బిహార్ క్రికెట్ అసోసియేషన్ కూడా దీనిపై వ్యాఖ్యానించింది. అనురాగ్ ఠాకూర్ కేవలం ఒకే ఒక్క రంజీ మ్యాచ్ ఆడారని, అందులో హిమాచల్ ప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జమ్ము కశ్మీర్ జట్టుపై ఆడారని తెలిపింది. కేవలం క్రికెట్ బోర్డులలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆడి ఉంటారని ఎద్దేవా చేసింది. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. తాను కూడా చిన్న రాష్ట్రం నుంచే వచ్చానన్నారు. హిమాచల్ ప్రదేశ్ జట్టు తన రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ లాంటి చిన్న రాష్ట్రాలతోను, పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌తోను ఆడుతుందేమోనని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement