ఐయామ్ ద హోమ్ మినిస్టర్.. | Sakshi
Sakshi News home page

ఐయామ్ ద హోమ్ మినిస్టర్..

Published Fri, Aug 5 2016 8:42 AM

ఐయామ్ ద హోమ్ మినిస్టర్..

“I’m the home minister of my school council. Can I speak to you for five minutes?”.. అంటూ దివిత్ పంపిన మెసేజ్ ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వాన్నే కదిలించింది. నలుగురు టీచర్ల బదిలీని ఆపేసింది. ఆ వివరాల్లోకెళ్తే...

దివిత్ రాయ్.. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా, హరది గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియలో ఆ పాఠశాలకు చెందిన నలుగురు టీచర్లు బదిలీ అవుతున్నారని దివిత్‌కు తెలిసింది. దీంతో అప్పటిదాకా విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లు వెళ్లిపోతుంటే తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వారి బదిలీని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. పాఠశాల విద్యామండలిలో సభ్యుడైన దివిత్.. ముందుగా మిగతా టీచర్లను సంప్రదించాడు. బదిలీలను ఆపేందుకు ఏం చేయలేమా? అని ప్రశ్నించాడు.

‘అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని ధిక్కరించే అధికారం మాకెవ్వరికీ లేద’ని చెప్పడంతో ఆ ప్రభుత్వాన్నే అడగాలనుకున్నాడు. వివిధ సంక్షేమ పథకాల అమల్లోభాగంగా ఆ రాష్ట్ర హోంమంత్రి ఫోన్ నంబర్ రాష్ట్ర ప్రజల కోసం అందుబాటులో ఉంచారన్న విషయం తెలుసుకున్న దివిత్... నేరుగా హోంమంత్రికే లేఖ విషయం చెప్పాలనుకున్నాడు. వాయిస్ మెసేజ్ రూపంలో ‘మా పాఠశాల కౌన్సిల్‌కు నేనూ హోం మినిస్టర్‌నే. నేనో ఐదు నిమిషాలు మీతో మాట్లాడవచ్చా?’ అంటూ వచ్చిన ఆ మెసేజ్‌ను హోంమంత్రిత్వశాఖ.. హోంమంత్రి జి. పరమేశ్వర దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం నుంచి ఫోన్..
మరునాడే దివిత్ తల్లికి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు దగ్గర నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘మీ అబ్బాయి పంపిన మెసేజ్ మాకు చేరింది. ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు?’ అని అడగడంతో.. దివిత్‌ను పిలిచి ఫోన్ ఇచ్చింది తల్లి. ఫోన్ అందుకున్న దివిత్.. ‘సర్ మా టీచర్లను బదిలీ చేయాలని మీరు తీసుకున్న నిర్ణయం నాతోసహా ఎంతో మంది విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది. టీచర్లు వెళ్లిపోతే దాని ప్రభావం పిల్లల చదువులపై కూడా పడుతుంది. దయచేసి బదిలీలను ఆపివేయండ’ని కోరాడు.

‘తన చదువుపట్ల, తోటివారి భవిష్యత్తుపట్ల దివిత్‌కు ఉన్న దృక్పథం నన్ను ఎంతగానో కదిలించింది. ఆ స్కూల్ టీచర్లను బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. వారంతా ఇకపై కూడా అదే పాఠశాలలో కొనసాగుతార’ని హోంమంత్రి స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు.
 

Advertisement
Advertisement