భారత్‌కు ‘రఫెల్’ రక్షణ | Sakshi
Sakshi News home page

భారత్‌కు ‘రఫెల్’ రక్షణ

Published Sat, Sep 24 2016 6:31 AM

భారత్‌కు ‘రఫెల్’ రక్షణ - Sakshi

36 యుద్ధవిమానాల కోసం భారత్-ఫ్రాన్స్ ఒప్పందం   రూ. 59 వేల కోట్ల ఒప్పందంపై సంతకాలు
* రఫెల్‌లో ఆధునిక ఆయుధ వ్యవస్థ  
* సుదూర లక్ష్యాల్ని ఛేదించే క్షిపణులు

న్యూఢిల్లీ: మరో మూడేళ్లలో భారత వాయుసేన(ఐఏఎఫ్) అమ్ములపొదిలోకి అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాలు కొలువుదీరనున్నాయి. గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాల్ని ఛేదించే క్షిపణులతో పాటు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు వీటి ప్రత్యేకతలు. ఐఏఎఫ్ సామర్థ్యాన్ని దాయాది పాక్‌కు అందనంత ఎత్తుకు తీసుకుపోయే ఈ ఒప్పందంపై శుక్రవారం భారత్, ఫ్రాన్స్ సంతకం చేశాయి.

దాదాపు రూ. 59 వేల కోట్ల విలువైన ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు మనోహర్ పరీకర్, జీన్ ఇవెస్ లెడ్రియన్‌లు సంతకం చేశారు. యుద్ధ విమానాల్లో భారత్ సూచించిన పలు మార్పులు చేయనున్నారు. గత 20 ఏళ్లలో జరిగిన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఇదే. 36 రఫెల్ విమానాలు కొనేందుకు భారత్ సిద్ధమని గతేడాది ఫ్రాన్స్ పర్యటనలో నరేంద్ర చేసిన మోదీ ప్రకటనతో ఈ ప్రక్రియ మొదలైంది. యూపీఏ హయాంలో 126 రఫేల్ విమానాల కోసం రూ. 1.34 లక్షల కోట్ల ఒప్పందాన్ని గతేడాది మోదీ ప్రభుత్వం రద్దుచేసింది. తాజా ఒప్పందంలో ఫ్రెంచ్ ప్రభుత్వంతో బేరసారాల అనంతరం రూ. 2,454 కోట్ల తగ్గింపునిచ్చారు. 36 నెలల్లో తొలి విమానాన్ని, ఒప్పందం కుదిరిన 67 నెలల్లోపు మొత్తం విమానాల్ని అందచేయాలి. ‘ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో విడిభాగాల సరఫరా, మరమ్మతులు, నిర్వహణ సేవలతో పాటు భారత్ సూచించిన ప్రత్యేక మార్పులు కూడా చేస్తారు’ అని ఒప్పందం అనంతరం పరీకర్ ప్రకటించారు. భారత వాయుసేనకు కావాల్సిన సామర్థ్యం అందుకునే క్రమంలో ఇదొక ముందడుగు అన్నారు.
ఒకే రోజులో ఐదు కార్యకలాపాలు.. క్షిపణుల్ని ప్రయోగించే సామర్థ్యమున్న రఫెల్ యుద్ధ విమానాలతో వాయుసేనకు ఆ లోటు తీరనుంది. పాక్‌లోని లక్ష్యాలతో పాటు దేశ ఉత్తర, తూర్పు సరిహద్దుల నుంచి లక్ష్యాలకు గురిపెట్టే సామర్థ్యం ఉంటుంది.   అన్ని రకాల దాడులు చేయడంతో పాటు ఒకేసారి గాల్లోని, భూఉపరితలంపై లక్ష్యాల్ని చేధించవచ్చు. అత్యంత వేగంగా పని ముగించడంతో పాటు... ఒకే రోజులో ఐదు కార్యకలాపాలు(మిషన్లను) పూర్తిచేసే సత్తా వీటి సొంతం. భారత్ సూచన మేరకు ఏర్పాటు చేసే ఇజ్రాయెల్ తరహా హెల్మెట్ డిస్‌ప్లేతో లేహ్ వంటి గడ్డకట్టే చలిలో కూడా విమానాల్ని నడపవచ్చు. అలాగే రాడార్ హెచ్చరిక రిసీవర్లు, లో బ్యాండ్ జామర్లు, 10 గంటల విమాన సమాచారం రికార్డు చేసే సామర్థ్యం, ఇన్‌ఫ్రారెడ్ సెర్చింగ్, ట్రాకింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రమాద సమయంలో ప్రాణాలతో సులువుగా బయటపడే సదుపాయాలు అదనం.
 
విమానాల కోసం రూ. 25,588 కోట్లే..

ఒక్క సీటు విమానం దాదాపు రూ. 680 కోట్లు కాగా, రెండు సీట్ల విమానం కోసం రూ. 703 కోట్లు చెల్లిస్తున్నారు. మొత్తం 36 విమానాల కోసం రూ. 25,588 కోట్లు మాత్రమే ఖర్చు కాగా... భారత్ సూచించిన మార్పులు, నిర్వహణ కోసం మిగతా మొత్తం వ్యయం కానుంది. విమానానికి అమర్చే ఆయుధాల కోసం రూ.5,312 కోట్లు, ఇజ్రాయెల్ తరహా హెల్మెట్ డిస్‌ప్లే కోసం రూ. 12,719 కోట్లు ఖర్చు కానున్నాయి. 36 యుద్ధ విమానాల సహాయ సామాగ్రికి రూ. 13,427 కోట్లను వెచ్చించనున్నారు.

ఇక నిర్వహణ సేవల కోసం రూ. 2,641 కోట్లు ఖర్చవుతాయి. ఒప్పంద సమయంలో ఫ్రాన్స్ రూ. 64,343 కోట్లు(8.6 బిలియన్ యూరోలు)కు ఒప్పందాన్ని ఖరారు చేయగా.. పలు దఫాల చర్చలనంతరం  ధర తగ్గించారు. జనవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ భారత్ పర్యటన సమయంలో విమానాల కోసం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆ సమయంలోని ధరనే వసూలు చేయాలని, అలాగే యూరోపియన్ ద్రవ్యోల్బణ సూచీల్ని పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయించాలన్న భారత్ వాదన తో చివరకు ఫ్రాన్స్ దిగొచ్చింది. కాగా, రఫెల్ విమానాల కోసం ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేస్తే భారత్‌లోనే తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement