22 నుంచి వైమానిక ఉన్నతాధికారుల భేటీ

20 Jul, 2020 06:01 IST|Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌–చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు వైమానిక దళం ఉన్నతాధికారులు ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా, ఏడుగురు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌లు పాల్గొంటారని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు.

చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్‌–2000, సుఖోయ్‌–30, మిగ్‌–29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్‌ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్‌ ఫైటర్లు జెట్లు ఈ మాసాంతంలోనే ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ ఫైటర్‌ జెట్లను లద్ధాఖ్‌ సెక్టార్‌లో మోహరించాలని యోచిస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.   

మరిన్ని వార్తలు