షూటింగ్లో చిందేసి.. బుక్కయ్యాడు.. | Sakshi
Sakshi News home page

షూటింగ్లో చిందేసి.. బుక్కయ్యాడు..

Published Thu, Apr 9 2015 3:20 PM

షూటింగ్లో  చిందేసి.. బుక్కయ్యాడు..

గిరిధ్:  సినిమా షూటింగ్లో ఒక ఐఏఎస్ అధికారి అసభ్యనృత్యాలు చేసిన వీడియో ఒకటి జార్ఘండ్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. దీంతో  ఆ ఉన్నతాధికారిని ఆగమేఘాల మీద ప్రభుత్వం వేరే శాఖకు  బదిలీచేసింది. చిల్కారి ఏక్ దర్ద్ అనే సినిమా షూటింగ్లో నటించేందుకు   వెళ్లిన  డిప్యూటీ కమిషనర్ దినేష్ ప్రసాద్,  సినీ డాన్సర్లతో కలిసి చిత్తుగా చిందేశాడు.  కొంతమంది  దీన్ని వెలుగులోకి తేవడంతో రగడ మొదలైంది. 2007లో ఒకే గ్రామానికి చెందిన 19మంది గ్రామస్తుల ఊచకోత ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో  సినీ ఆర్టిస్టులతో  కలిసి ఐఏఎస్ ఆఫీసర్  దినేష్ హల్చల్  చేసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.


జార్ఖండ్ ముక్తి  మోర్చా దీనిపై ఆందోళనకు దిగింది.  ఈ సినిమాపై  వివాదం ఉన్న నేపథ్యంలో షూటింగ్ను నిలుపుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు.   సినిమా నిషేధంకోసం కోర్టుకు వెళతామని తెలిపారు. అయితే ఐఏఎస్ అధికారి దినేష్ ప్రసాద్ తన వైఖరిని సమర్థించుకున్నారు.  డ్యూటీ అయిపోయిన తర్వాత  సినిమాలో నటిస్తే తప్పేముందని ఆయన అంటున్నారు. మరోవైపు చిత్ర దర్శకుడు  అలీఖాన్  ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్  కోసం ఇలాంటి మసాలాలు తప్పవంటూ సమర్ధించుకున్నారు. దీంట్లో అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

అయితే 2007 హత్యాకాండ నుంచి త్రుటిలో తప్పించుకున్న మాజీముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ సోదరుడు నూను మరాండీ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.  తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు  కోల్పోయిన  వారిని అవమానపర్చేది గాను, వారి బంధువుల సెంటిమెంటు దెబ్బతీసేదిగా  సినిమా దృశ్యాలున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ (ఎంసిసి) తీవ్రవాదులు విసిరిన పంజాలో ఎంపీ, మాజీముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమారుడితో పాటు ఒకే గ్రామానికి చెందిన 19మంది హతమైన  ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఈ ఘటన ఆధారంగానే  చిల్కారి ఏక్ దర్ద్  అనే సినిమా తెరకెక్కుతున్నట్టు  సమాచారం.

Advertisement
Advertisement