తాజా ‘పనామా’లో మనోళ్లు 2వేలు | Sakshi
Sakshi News home page

తాజా ‘పనామా’లో మనోళ్లు 2వేలు

Published Wed, May 11 2016 1:32 AM

తాజా ‘పనామా’లో మనోళ్లు 2వేలు

మెట్రోలతోపాటు గ్రామీణ ప్రాంతాల చిరునామాలూ లభ్యం
* తొలి జాబితాపై కొనసాగుతున్న విచారణ

న్యూఢిల్లీ: పనామా పేపర్ల లీకేజీతో గత నెలలో సంచలనం సృష్టించిన ఇంటర్నేషన్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఇందులో దాదాపు 2వేల మంది భారతీయుల పేర్లున్నట్లు తెలిసింది. ఐసీఐజే పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం.. కొత్త జాబితాలో భారతీయులకు సంబంధమున్న 22 విదేశీ కంపెనీలు, 1,046 మంది అధికారులు లేదా వ్యాపారులు, సెలబ్రిటీల వ్యక్తిగత సమాచారంతో పాటు 42 మంది మధ్యవర్తులు 828 చిరునామాలు వెల్లడైనట్లు సమాచారం.

వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా,చెన్నై వంటి మెట్రో నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాలైన హరియాణాలోని సిర్సా, బిహార్‌లోని ముజఫర్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని మాంద్సౌర్, ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న చిన్న పట్టణాలనుంచి కూడా చిరునామాలున్నట్లు తెలిసింది. ఐసీఐజే మంగళవారం హాంకాంగ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, నెవడాతోపాటు 21 దేశాల్లో చోట్ల ఉన్న పలు కంపెనీల వివరాలను వెల్లడించింది. పనామాలోని న్యాయ సలహా సంస్థ మొసాక్ ఫోన్సెకా నుంచి సేకరించిన సమాచారంలో కొన్ని కంపెనీలు, ట్రస్టులు విదేశీ కంపెనీల పేరును న్యాయబద్ధంగానే వాడుకుంటున్నట్లు వెల్లడైందని ఐసీఐజే తెలిపింది.

గత నెల సంచలనం సృష్టించిన ఈ పేపర్స్ లీక్ తొలి జాబితాలో 500 మంది పేర్లు వెల్లడవటంతో.. వీటిపై విచారణకు ఆర్బీఐ, ఆదాయపు పన్ను శాఖ, ఎఫ్‌ఐయూ, విదేశీ పన్ను విశ్లేషణ సంస్థల అధికారులతో భారత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
 
జాబితాలో 259 మంది పాకిస్తానీలు..
తాజా జాబితాలో పాకిస్తాన్ అధికారులు,  సినీ దర్శకుడు ఒబైద్ చినోయ్ తల్లితోపాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లున్నాయి. ఇందులో చాంబర్ ఆఫ్ కామర్స్, పోర్టు ట్రస్టుల అధ్యక్షులు పేర్లు కూడా వెల్లడయ్యాయి. అయితే ఇందులో రాజకీయ నాయకుల పేర్లేమీ లేవని తెలిసింది. కాగా, తన తల్లిపేరుతో ఉన్న విదేశీ కంపెనీలు చట్టబద్ధంగానే రిజిస్టర్ అయ్యాయని ఒబైద్ వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement