ఆదర్శంగా నిలిచారు: రాహుల్‌గాంధీ | Sakshi
Sakshi News home page

ఆదర్శంగా నిలిచారు: రాహుల్‌గాంధీ

Published Fri, Jun 6 2014 1:51 AM

ఆదర్శంగా నిలిచారు: రాహుల్‌గాంధీ

ఎవరెస్ట్ విజేతలను ప్రశంసించిన రాహుల్‌గాంధీ
 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎవరెస్ట్‌ను అధిరోహించి దిగ్విజయంగా తిరిగొచ్చిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లు గురువారమిక్కడ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించి దేశంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో కలసి ఫొటోలు దిగారు. అనంతరం పూర్ణ, ఆనంద్‌లు కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. వారిని మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు.
 
 వారిద్దరికి రూ.11,001ల చెక్‌ను అందజేశారు. ఇదిలా ఉండగా పూర్ణ, ఆనంద్‌లను ఆల్ ఇండియా దళిత్ ఫెడరేషన్, ఏపీభవన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీభవన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఏపీభవన్‌లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీలు కె.కేశవరావు, దత్తాత్రేయ, రాపోలు ఆనంద్ భాస్కర్, జాతీయ సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్, ఆయా సంఘాల నేతలు ఆనంద్‌రావు, లింగరాజులు పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి రూ.10వేల చెక్ అందించారు.
 
 8న హైదరాబాద్‌కు ఎవరెస్టు వీరులు
 ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డును సృష్టించిన మాలావత్ పూర్ణ(13), ఆనంద్(18)లు ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ అధికారి కె.వెంకటేశ్వర్లు, ఫిజికల్ డెరైక్టర్ బద్రినాథ్ తెలిపారు. వారిద్దరికి ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement
Advertisement