ఈ ఏడాది మంచి వర్షాలు | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది మంచి వర్షాలు

Published Wed, Apr 13 2016 1:48 AM

ఈ ఏడాది మంచి వర్షాలు

ఈశాన్య ప్రాంతాలు, తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో తక్కువ వర్షపాతం
 
 న్యూఢిల్లీ: సాధారణం కంటే మెరుగైన వర్షాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా కురియనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఈ ఏడాది సాధారణం, అంత కన్నా అధిక వర్షపాతం కురిసేందుకు 94 శాతం అవకాశాలున్నాయని  ఐఎండీ డెరైక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ మంగళవారం చెప్పారు. ‘స్వల్ప వర్షపాతం కురుస్తుందని చెప్పేందుకు కేవలం ఒక శాతం అవకాశమే ఉంది. కరువు బాధిత ప్రాంతాలైన మరాఠ్వాడా, బుందేల్‌ఖండ్‌లలో ఏడాది అధికంగా వర్షాలు కురుస్తాయి. మొత్తంమీద దేశమంతా అన్ని చోట్లా దాదాపుగా ఒకేతీరుగా వర్షాలు కురుస్తాయి’ అని చెప్పారు.

ఈశాన్య భారత ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. అలాగే ఆగ్నేయ ప్రాంతంలోని తమిళనాడు, అక్కడికి దగ్గర్లోని రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం కురుస్తుందన్నారు. నెలలవారీగా చూసుకున్నా సరిపడా వర్షపాతం కురిసే అవకాశాలున్నాయన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని.. దీనికి సన్నద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వర్షపాత నమూనాలు తదితర అంశాలపై మరిన్ని వివరాలు జూన్‌లో వెల్లడిస్తామన్నారు. ఐఎండీ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ మాట్లాడుతూ కిందటేడాది రుతుపవనాలను దెబ్బతీసిన ఎల్ నినో పరిస్థితులు తగ్గుముఖం పడతాయన్నారు. ఈ రుతుపవన సీజన్ చివరి దశ (ఆగస్టు-సెప్టెంబర్)లో లా నినో ఏర్పడేందుకు అవకాశం ఉందని అన్నారు. ఇది రుతుపవనాలకు మంచిదని చె ప్పారు.

Advertisement
Advertisement