పరీక్ష రాసింది 12,000.. పాసైంది 20,000 | Sakshi
Sakshi News home page

పరీక్ష రాసింది 12,000.. పాసైంది 20,000

Published Sun, Dec 13 2015 3:53 PM

పరీక్ష రాసింది 12,000.. పాసైంది 20,000 - Sakshi

ఆగ్రా: బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాలను ప్రకటించడానికి ఉపక్రమించిన అధికారులు తమ చేతిలో ఉన్న గణాంకాలను చూసి షాక్కు గురయ్యారు. ఆగ్రాలోని ఈ యూనివర్సిటీ తరపున మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 12,800 మంది ఉన్నట్లు తొలుత తెలిపిన అధికారులు తీరా ఫలితాలను ప్రకటించే సమయానికి 20,089 మంది పాసైనట్లు గుర్తించారు.

దీనిపై యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ మహమ్మద్ ముజమ్ముల్ విచారణకు ఆదేశించి, చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేశారు.  యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాల లిస్టును తయారు చేయడానికి ఓ ప్రైవేట్ ఏజెన్సీని నియమించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు నిబంధనలను ఉల్లంఘించి  విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అనుమతించడం వలనే ఈ గందరగోళం ఏర్పడిందని భావిస్తున్నారు. పరీక్షలు మొదలయ్యే రోజున కూడా కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలలు తమకు కేటాయించిన సీట్లకు మించి విద్యార్థులను చేర్చుకున్నట్లు గుర్తించిన అధికారులు.. కళాశాలల యాజమాన్యాన్ని విద్యార్థుల లిస్టును తీసుకురావాల్సిందిగా ఆదేశించారు.
 

Advertisement
Advertisement