బతకడం కోసం.. గడ్డి రోటీలు తింటున్నారు | Sakshi
Sakshi News home page

బతకడం కోసం.. గడ్డి రోటీలు తింటున్నారు

Published Tue, Dec 8 2015 1:44 PM

బతకడం కోసం.. గడ్డి రోటీలు తింటున్నారు

భారీ వర్షాలు, వరదలకు చెన్నైవాసులు వారం రోజుల పాటు ఎన్నో కష్టాలుపడ్డారు. తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు దొరకక అలమటించారు. చెన్నై వాసుల కష్టాలు చూసి దేశమంతా చలించిపోయింది. వారిని ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందుకువచ్చారు. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్లో చాలా గ్రామాల్లో నిత్యం ఇదే పరిస్థితి. అక్కడ వర్షాలు, వరదలు లేవు కానీ.. కరువు, పేదరికంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేదు. గడ్డితో తయారు చేసిన రోటీలు తిని బతుకుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది.

యూపీలోని బుందేల్ఖండ్ ప్రాంతంలో వర్షాభావం వల్ల కొన్నేళ్లుగా పంటలు పండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు పేదరికంతో మగ్గిపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. వారికి గడ్డి, కలుపు మొక్కలే ఆహారం. వీటిని రోటీలుగా చేసుకుని కడుపు నింపుకొంటున్నారు. 'సాధారణంగా గడ్డిని పశువులకు వేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం బతకాలంటే ఇదే గడ్డి తినడం మినహా మరో మార్గం లేదు' అని స్థానికులు వాపోయారు.

ఎండిన గడ్డి మొక్కలను (ఫికార్) కోసుకుని వాటిలోని విత్తనాలను ఇంటికి తీసుకెళతారు. ఆ విత్తనాలను రోకట్లో దంచి పిండిలా తయారు చేస్తారు. ఈ పిండినీ రోటీల ఆకారంలో చేసి పొయ్యిలో కాల్చుకుంటారు. ఆ ప్రాంతంలో లభించే 'సమాయ్' అనే మొక్కల ఆకులను నీళ్లలో ఉడికించి కొంచెం ఉప్పు, నూనె వేసి కూరగా చేస్తారు. వీటిని పిల్లలకు వండిస్తారని స్థానికులు తెలిపారు. పేదరికం వల్ల బుందేల్ఖండ్లో చాలా గ్రామాల ప్రజలకు రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని రెణ్నెల్ల క్రితమే యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement
Advertisement