వ్యాధి కంటే వైద్యమే భయంకరం! | Sakshi
Sakshi News home page

వ్యాధి కంటే వైద్యమే భయంకరం!

Published Tue, Nov 15 2016 1:37 PM

వ్యాధి కంటే వైద్యమే భయంకరం! - Sakshi

ముంబై: నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. వ్యాధి కంటే వైద్యమే భయంకరంగా ఉందంటూ ఉద్ధవ్‌ ఠాక్రే సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. మోదీ తీసుకున్న నిర్ణయం యావత్‌ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిందని దుయ్యబట్టారు. నల్ల ధనాన్ని అంతమొందించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ఆయన ఎంచుకున్న మార్గం చాలా భయానకంగా ఉందన్నారు. దేశంలో ఉన్న జనాభా అంతటిని అవినీతి పరులు, నల్లధనం గల వారని ప్రభుత్వ భావిస్తుందా? అని ప్రశ్నించారు. 
 
నల్ల ధనం అనేది కేవలం 125 వ్యాపార, రాజకీయ కుటుంబాల వద్దనే ఉందని ఆరోపించారు. కాగా మీరు తీసుకున్న నిర్ణయంతో ఎంతమంది రూ.500, 1000 నోట్ల బండళ్లు చేతపట్టుకుని క్యూలో నిలబడ్డారని ఉద్ధవ్‌ మోదీని ప్రశ్నించారు. కొద్ది మంది పారిశ్రామిక వేత్తల వద్ద ఉన్న నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు యావత్‌ దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. మోదీ తీసుకున్న కఠోర నిర్ణయం వల్ల కోట్లాది పేద ప్రజలు రోడ్డున పడ్డారని, భోజనం లేక బ్యాంకు క్యూలలో విలవిల కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతున్నారన్నారు. నల్లధనం దేశానికి క్యాన్సర్‌ లాంటిదే, కాని దాన్ని  వెలికి తీసే పద్ధతి మాత్రం ఇది కాదన్నారు. గతవారం రోజులుగా నరకం అనుభవిస్తున్న దేశ జనాభా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు.   

 

Advertisement
Advertisement