అఫ్గాన్‌కు మరింత రక్షణ సహకారం | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌కు మరింత రక్షణ సహకారం

Published Tue, Sep 12 2017 3:36 AM

అఫ్గాన్‌కు మరింత రక్షణ సహకారం

 భద్రత, ఇతర రంగాల్లో సహకరిస్తామన్న భారత్‌
 అఫ్గాన్‌లో 116 ప్రాజెక్టులు చేపట్టేందుకు సంసిద్ధత


న్యూఢిల్లీ:  వ్యూహాత్మక భాగస్వామి అయిన అఫ్గానిస్తాన్‌ భద్రతా వ్యవస్థ పటిష్టతకు మరిం త సహకారం అందిస్తామని భారత్‌ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ నుంచి ఎదురవుతున్న సరిహద్దు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనేందుకు విస్తృత స్థాయిలో కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్‌ రబ్బానీ సోమవారం భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

అఫ్గాన్‌లో రక్షణ వ్యవస్థ పటిష్టతతో పాటు అక్కడ కొత్తగా 116 అత్యున్నత స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు సుష్మా ఈ సందర్భంగా వెల్లడించారు. ఇరు దేశాలకూ ప్రమాదకరంగా మారిన సరిహద్దు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు. ‘భద్రత, సుస్థిరత, శాంతియుత, హింసలేని అఫ్గాన్‌ నిర్మాణం కోసం అక్కడి ప్రజలు చేస్తున్న కృషికి భారత్‌ సహకారం కొనసాగుతుంది. వారి కలల సాకారం కోసం ఇరు దేశాలూ కలసి పనిచేస్తాయి’అని సుష్మా పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా సుష్మా–రబ్బాని నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్‌తో మిత్రుత్వం మరో పొరుగు దేశంతో శతృత్వానికి కాదని రబ్బానీ స్పష్టం చేశారు.  

ఉగ్ర పోరాటానికి మద్దతు: మోదీ
అఫ్గాన్‌తో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు భారత్‌ పూర్తి మద్దతునిస్తుందని ఉద్ఘాటించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అఫ్గాన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుష్మాతో భేటీ అనంతరం అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి రబ్బానీ.. మోదీని కలిశారు. ప్రజాస్వామిక, శాంతియుత అఫ్గాన్‌ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం చేస్తున్న కృషికి మానవీయ కోణంలోనూ, అభివృద్ధి పరంగానూ తమ సహకారం ఉంటుందని మోదీ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement