Sakshi News home page

భారత్‌ మా సాయం కోరింది: పాక్‌

Published Fri, Mar 17 2017 5:59 PM

భారత్‌ మా సాయం కోరింది: పాక్‌

ఇస్లామాబాద్‌: ఇద్దరు మత గురువుల అదృశ్యంపై భారత అధికారులు తమ సాయం కోరినట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ అభ్యర్థనను అంతర్గత వ్యవహారాల శాఖకు పంపి, దర్యాప్తు చేపట్టాలని కోరినట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్‌ జకారియా మీడియాకు వెల్లడించారు. సయ్యద్‌ అసిఫ్‌ అలీ నిజామీ(80), ఆయన సోదరుడు నజీం అలీ నిజామీతో కలసి మార్చి 8వ తేదీన పాకిస్తాన్‌ వెళ్లారు. లాహోర్‌లోని హజరత్ దాతా దర్బార్ దర్గాలో ఛద్దర్‌ సమర్పించిన వారిద్దరూ అక్కడి నుంచి కరాచీ వెళ్లాల్సి ఉంది. అయితే, లాహోర్‌ అధికారులు సరైన పత్రాలు లేవంటూ నజీంను ఆపేశారు. ఆపై వారెక్కడున్నారన్న సమాచారం తెలియకుండా పోయింది. మత గురువుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టినట్లు నఫీజ్ తెలిపారు.

భారత మత గురువుల అదృశ్యంపై ఇస్లామాబాద్ లోని భారత హైకమిషనర్ విదేశాంగశాఖకు గురువారం ఫిర్యాదు చేసింది. ఐఎస్ఐ ఏజెంట్లు వారిని రహస్య ప్రదేశానికి తరలించినట్లు వదంతులు వ్యాప్తి చెందాయి. లాహోర్‌లోని దర్బార్‌కు వచ్చిన ఇద్దరు మత గురువుల అదృశ్యంపై ఇప్పటికే పాకిస్తాన్‌ అధికారులతో మాట్లాడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు. లాహోర్ లోని దాతా దర్బార్ దర్గాతో పాటుగా భారత్ లోని నిజాముద్దీన్ ఔలియా దర్గాలు పరస్పరం కొన్ని సాంప్రదాయిక వస్తువులను ఇచ్చి పుచ్చుకుంటాయన్న విషయం తెలిసిందే. మరోవైపు ఇస్లామిక్ జిహాదీలు మత గురువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో వీరి అదృశ్యం భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.

Advertisement

What’s your opinion

Advertisement